సారీ.. ఏదో భావోద్వేగంలో భారత ప్రధాని పేరు చెప్పా!. ఆరోపణల్లో నిజం లేదు

13 Jun, 2022 18:21 IST|Sakshi
శ్రీలంక మాజీ ప్రధాని మహీందతో ప్రధాని మోదీ (పాత ఫొటో)

Sri Lanka Adani Row: శ్రీలంకలో ఎనర్జీ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ బిడ్‌ వ్యవహారంపై పెనువివాదం చెలరేగింది. శ్రీలంక విద్యుత్‌ అథారిటీ చీఫ్‌ ఫెర్డినాండో ఈ ప్రాజెక్ట్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి మేరకే అధ్యక్షుడు గోటబయ రాజపక్స తలొగ్గి.. గౌతమ్‌ అదానీ గ్రూప్‌కి ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంటరీ ప్యానెల్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కమిటీ బహిరంగ విచారణలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాజపక్స తనతో స్వయంగా చెప్పారని కూడా అన్నారు.

ఐతే ఆ అభియోగాలను ఖండిస్తూ అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ...."మన్నార్‌లో 500 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఉంది.  ఈ ప్రాజెక్టుని ఏ వ్యక్తికి లేదా ఏ సంస్థకు ఇవ్వడానికి తాను ఏసమయంలోనూ ఎవరికీ అధికారం ఇవ్వలేదని, పేర్కొన్నారు. అయితే ప్రాజెక్ట్‌ల కోసం సంస్థల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని, ఇది శ్రీలంక ప్రభుత్వంచే పారదర్శకంగా, జవాబుదారీ వ్యవస్థకు అనుగుణంగా నిర్వహించబడుతుంది" అని అధ్యక్షుడు రాజపక్స కార్యాలయం తెలిపింది.

ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణలు చెప్పారు. ఆనుకోని ఒత్తిళ్లు, భావోద్వేగాలు కారణంగా భారత ప్రధాని పేరు చెప్పాల్సి వచ్చిందని వివరణ కూడా ఇచ్చారు. తాజాగా తన పదవికి కూడా రాజీనామా చేశారు. 

ఐతే శ్రీలంక తన చట్టాలను మార్పు చేసి, ఇంధన ప్రాజెక్టు కోసం పోటీ బిడ్డింగ్‌ని వదిలేయండంపై పార్లమెంట్‌లో చర్చ జరగడంతో ఈ వివాదం చెలరేగింది. వాస్తవానికి అదానీ గ్రూప్‌ డిసెంబర్‌లో మన్నార్‌, పూనేరిన్‌లలో రెండు విద్యుత్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లను దక్కించుకుంది. గౌతమ్‌ అదానీ శ్రీలంక సందర్శించడమే కాకుండా రాజపక్సతో సమావేశం గురించి ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు కూడా. 

(చదవండి: ఉ‍క్రెయిన్‌ని మట్టికరిపిస్తున్న రష్యాసేనలు.. యుద్దంలో కీలక పరిణామం)

మరిన్ని వార్తలు