ట్విట్టర్‌కు శ్రీరామ్‌ రిపేర్లు  

2 Nov, 2022 08:17 IST|Sakshi

న్యూయార్క్‌: దిగ్గజ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను సంస్కరణల బాట పట్టిస్తానని ప్రతిజ్ఞ చేసిన దాని నూతన అధిపతి ఎలాన్‌ మస్క్‌ దృష్టి టెక్నాలజీ నిపుణుడు, చెన్నై వ్యక్తి శ్రీరామ్‌ కృష్ణన్‌పై పడింది. టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా విశేష అనుభవం ఉన్న శ్రీరామ్‌కు ట్విట్టర్‌లో కీలక మార్పులు చేర్పుల తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

చెన్నైలో జన్మించిన శ్రీరామ్‌ గతంలో అన్నా యూనివర్సిటీ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కాలేజీలో 2001–05లో ఇంజనీరింగ్‌(ఐటీ) పూర్తిచేశారు. మైక్రోసాఫ్ట్‌లో వృత్తిజీవితం మొదలుపెట్టిన ఈయన 2017లో కొంతకాలం ట్విట్టర్‌లో పనిచేశారు. సెర్చ్, డిస్కవరీ, హోమ్‌ టైమ్‌లైన్, ఆన్‌ బోర్డింగ్‌/న్యూ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్, ఆడియన్స్‌ గ్రోత్‌ వంటి కోర్‌ ప్రొడక్ట్‌ విభాగాలకు నాయకత్వం వహించారు.

రీ–డిజైన్‌ చేసిన ఈవెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉత్పత్తులను స్వయంగా ప్రారంభించారు. స్నాప్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలకు మొబైల్‌ ప్రకటనల ఉత్పత్తుల అభివృద్ధిని పర్యవేక్షించారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలోని పెట్టుబడుల (వెంచర్‌ క్యాపిటల్‌) సంస్థ అడ్రెసెన్‌ హోరోవిట్జ్‌(ఏ16జెడ్‌)లో ప్రస్తు తం భాగస్వామిగా ఉన్నారు. బిట్సీ, హోప్‌ఇన్, పాలీవర్క్‌ సంస్థలకూ సేవలందిస్తున్నారు.   

మరిన్ని వార్తలు