హాలోవీన్‌ వేడుకల్లో తొక్కిసలాట..150కి చేరిన మృతుల సంఖ్య

30 Oct, 2022 15:11 IST|Sakshi

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఘటన

సియోల్‌: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్‌ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.çహాలోవీన్‌ను పురస్కరించుకుని శనివారం రాత్రి వీధుల్లో  సంబరాలకు గుమిగూడిన జనం అకస్మాత్తుగా ఒక ఇరుకైన వీధిలోంచి పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ అనూహ్య ఘటనలో మృతుల సంఖ్య 151కి చేరింది. మరో 100 మందికి పైగా  గాయపడ్డారు. తొక్కిసలాటలో ఊపిరాడక ఈ మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటెవోన్‌ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన హాలోవీన్‌ ర్యాలీలో సుమారు లక్షమంది పాల్గొన్నాట్లు సమాచారం. వేల సంఖ్యలో గుమికూడిన ప్రజలు హ్యామిల్టన్‌ హోటల్‌ సమీపంలోని ఇరుకు మార్గం గుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కొందరు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోగా మరికొందరు చనిపోయారు.

పదుల సంఖ్యలో ఒకరిపై ఒకరు పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న వారికి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రులకు తరలించారు. రక్షణ, సహాయక చర్యల నిమిత్తం 400 మంది సిబ్బందిని, 140 వాహనాలను వినిగించామన్నారు. ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయిన 150 మందిపైగా బాధితులకు సీపీఆర్‌ అందించినట్లు తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతమంతా అంబులెన్సులు, పోలీసు వాహనాల సంచారంతో నిండిపోయింది.

తోపులాటకు కారణం
తోపులాటకు దారి తీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇరుకు వీధిలోని ఇటెవొన్‌ బార్‌కు ఓ సెలబ్రిటీ వచ్చారన్న వార్తలతో జనం అక్కడికి చేరుకునేందుకు ఒక్కసారిగా ప్రయత్నించడమే తోపులాటకు కారణమని స్థానిక మీడియా అంటోంది. 2020 కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు జనం పెద్ద సంఖ్యలో హాజరైనట్లు సమాచారం. ఆ ప్రాంతం అంత సురక్షితమైంది కాదంటూ శనివారం సాయంత్రం నుంచే సోషల్‌ మీడియాలో పోస్టులు ప్రత్యక్షం కావడం గమనార్హం.

అత్యవసర సమావేశం
విషాద ఘటన అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులు, మరణించిన వారి అంత్యక్రియలక నిర్వహణ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు