టర్కీ, గ్రీస్‌ల్లో భారీ భూకంపం

31 Oct, 2020 04:38 IST|Sakshi
ఇజ్మిర్‌ ప్రావిన్సులో కూలిన భవనం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

14 మంది మృతి

భారీగా ఆస్తి నష్టం

రెండు దేశాల మధ్య ఏజియన్‌ సముద్రంలో భూకంప కేంద్రం

స్వల్ప స్థాయి సునామీ హెచ్చరిక

ఇస్తాంబుల్‌: భారీ భూకంపం టర్కీ, గ్రీస్‌ దేశాల్లో విధ్వంసం సృష్టించింది. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్‌ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్‌ సముద్రంలో సంభవించిన పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను ముంచెత్తాయి. ఈ భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్‌ల్లో మొత్తం 14 మంది మరణించారు. టర్కీలో 12 మంది చనిపోయారని, అందులో ఒకరు నీళ్లలో మునిగి చనిపోయారని, 419 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. సామోస్‌ ద్వీపంలో గోడ కూలి ఒక యువతి, ఒక యువకుడు చనిపోయారని అధికారులు వెల్లడించారు.  

  భూకంపం ప్రభావం పశ్చిమ టర్కీలోని ఇజ్మిర్‌ పట్టణంపై భారీగా పడింది. అక్కడ పలు భవనాలు నేల కూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించాయి. మృతుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. భవన శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కుప్పకూలిన భవనాల శిధిలాల నుంచి 70 మందిని రక్షించామన్నారు. భూమి 25 నుంచి 30 సెకన్ల పాటు కంపించిందని స్థానికుడొకరు తెలిపారు. 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా టర్కీలోని సెఫారిసర్‌లో స్వల్ప స్థాయిలో సునామీ వచ్చింది. గ్రీస్‌ ద్వీపం సామోస్‌లో సునామీ హెచ్చరిక జారీ చేశారు. సముద్ర జలాలు వీధులను ముంచెత్తాయి.  భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి.   

భారీ విధ్వంసం
టర్కీలోని మూడో అతిపెద్ద నగరం ఇజ్మిర్‌. ఇక్కడే భూకంపం ఎక్కువ విధ్వంసం సృష్టించింది. ఇక్కడ 10కి పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయని, చాలా భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని ఇజ్మిర్‌ గవర్నర్‌ యువుజ్‌ సెలిమ్‌ కోస్గర్‌ తెలిపారు. సుమారు 12 భవనాల వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 38 అంబులెన్స్‌లు, రెండు హెలీకాప్టర్లు, 35 మెడికల్‌ టీమ్స్‌ సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయన్నారు. సెఫారిసర్‌లో వరదలు వచ్చిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

సామోస్‌ ద్వీపానికి ఉత్తర, ఈశాన్య ఉత్తరంగా 13 కిలోమీటర్ల దూరంలో ఏజియన్‌ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని యూరోపియన్‌–మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ ప్రకటించింది. భూకంప తీవ్రతను భూకంప లేఖినిపై ప్రాథమికంగా 6.9 గా నిర్ధారించింది. అయితే, అమెరికా జియోలాజికల్‌ సర్వే మాత్రం భూకంప తీవ్రతను 7.0 గా పేర్కొంది. 10 కిమీల లోతున మాత్రమే భూకంపం సంభవించినందున ప్రధాన భూకంపం అనంతర ప్రకంపనలు మరికొన్ని వారాల పాటు కొనసాగవచ్చని గ్రీక్‌కు చెందిన భూకంప నిపుణుడు ఎకిస్‌ సెలెంటిస్‌ హెచ్చరించారు. వాటిలో కొన్ని శక్తిమంతమైన భూకంపాలు కూడా ఉండవచ్చని అంచనా వేశారు.  భూకంప ప్రకంపనలు గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌తో పాటు బల్గేరియా వరకు విస్తరించాయి. టర్కీలో ఇస్తాంబుల్, మర్మరా, ఏజియన్‌ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.

>
మరిన్ని వార్తలు