సుమీ నుంచి సురక్షితంగా బయటకు

9 Mar, 2022 08:50 IST|Sakshi

న్యూఢిల్లీ: రష్యా భీకర దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌ నగరం సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులకు, భారత్‌లోని వారి తల్లిదండ్రులకు పెద్ద ఊరట లభించింది. నగరంలో ఉన్న మొత్తం 694 మంది విద్యార్థులను బస్సుల్లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంగళవారం వీరంతా అక్కడికి 175 కి.మీ.ల దూరంలోని పోల్టావాకు చేరుకున్నారు. అక్కడి నుంచి రైళ్ల ద్వారా పశ్చిమ ఉక్రెయిన్‌కు తరలిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ చెప్పారు.

అక్కడి నుంచి ఆపరేషన్‌ గంగ కార్యక్రమంలో భాగంగా అందరినీ విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తామన్నారు. అయితే, ఏ బోర్డర్‌ పాయింట్‌ వద్ద నుంచి ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం ఆయన తెలపలేదు. యుద్ధ తీవ్రతరమవుతున్న ప్రాంతంలో ఉక్రెయిన్, రష్యా ఆర్మీ సాయంతో మానవీయ కారిడార్ల గుండా విద్యార్థుల తరలింపు ప్రక్రియ సురక్షితంగా కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌ నుంచి రొమేనియాలోని సుసీవా అనే ప్రాంతానికి చేరిన 410 మంది భారతీయులను రెండు విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తున్నట్లు విమానయాన శాఖ తెలిపింది. మైకోలైవ్‌లో చిక్కుకుపోయిన 52 మంది నావికులను సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు. 

(చదవండి: పాక్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం)

మరిన్ని వార్తలు