Study Abroad: విదేశీ స్కాలర్‌షిప్‌లకు మార్గమిదిగో..!

29 Apr, 2021 19:28 IST|Sakshi

గత కొన్నేళ్లుగా దేశంలోని యువత దృష్టి విదేశీ యూనివర్సిటీల్లో చదువులపై ఎక్కువగా ఉంటోంది. ఏదో రకంగా స్టడీ కోసం అబ్రాడ్‌కు వెళ్లాలని గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. వీరి మార్గంలో అధిక ఫీజులు, ఇతర వ్యయాలు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. ప్రతిభావంతులకు ఆర్థిక అవరోధాలు అడ్డురాకూడదనే సదాశయంతో వివిధ దేశాలు, పలు ట్రస్టులు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. విదేశీ విద్య అభ్యర్థులకు ఉపయోగపడేలా ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు సంబంధించి ముఖ్యమైన స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లపై ప్రత్యేక కథనం..

ఆస్ట్రేలియా అవార్డ్స్‌ స్కాలర్‌షిప్స్‌ 
వీటిని ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫారిన్‌ అఫైర్స్‌ అండ్‌ ట్రేడ్‌ అందిస్తోంది. ఆస్ట్రేలియాలో పీజీ, పోస్ట్‌ డాక్టోరల్‌ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. ట్యూషన్‌ ఫీజు నుంచి మినహాయింపుతోపాటు రీసెర్చ్, అకడమిక్‌ వ్యయాలకు సరిపడే మొత్తం స్కాలర్‌షిప్‌గా లభిస్తుంది.
వెబ్‌సైట్: dfat.gov.au

► ఎండీవర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్స్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌: ఈ ప్రోగ్రామ్‌ పరిధిలో పీజీ, పోస్ట్‌ డాక్టోరల్‌ స్టడీస్‌ అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. పీజీ అభ్యర్థులకు రెండేళ్లు, పీహెచ్‌డీ అభ్యర్థులకు మూడున్నరేళ్ల వరకు స్కాలర్‌షిప్‌ గడువు ఉంటుంది.

► ఎండీవర్‌ ఆస్ట్రేలియా చెంగ్‌ కాంగ్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌: నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో రీసెర్చ్‌ చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ పథకం. ఎంపికైన అభ్యర్థులకు 23,500 ఆస్ట్రేలియా డాలర్లు లభిస్తాయి.

► ఎండీవవర్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ అవార్డ్స్‌: ఆస్ట్రేలియా ప్రభుత్వ పరిధిలోని కళాశాలలు, యూనివర్సిటీలలో డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, అసోసియేట్‌ డిగ్రీలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు వీటిని అందజేస్తారు. 

► ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ స్కాలర్‌షిప్స్‌: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ విద్యార్థులకు ఉద్దేశించిన పథకం ఇది. ప్రతి ఏటా మూడు వందల మంది విదేశీ విద్యార్థులను ఆయా ప్రామాణికాల(రీసెర్చ్‌ టాపిక్, అకడమిక్‌ రికార్డ్‌ తదితర) ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్స్‌: https://india.highcommission.gov.au/ 
https://www.studyinaustralia.gov.au/

కెనడా: బాంటింగ్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్స్‌
హెల్త్‌ సైన్స్, నేచురల్‌ సైన్సెస్, ఇంజనీరింగ్, సోషల్‌ సైన్సెస్, హ్యుమానిటీస్‌ విభాగాల్లో రీసెర్చ్‌ ఔత్సాహికులకు బాంటింగ్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్స్‌ను అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి డెబ్భై వేల డాలర్లు లభిస్తాయి. ఏటా 70 ఫెలోషిప్స్‌(అన్ని దేశాలకు కలిపి) అందుబాటులో ఉంటాయి. వ్యవధి: రెండు సంవత్సరాలు.
వెబ్‌సైట్‌:  banting.fellowships-bourses.gc.ca

► ట్రుడే సాలర్‌షిప్స్‌: వీటిని ది ట్రుడే ఫౌండేషన్‌ అందిస్తోంది. డాక్టోరల్‌(రీసెర్చ్‌) స్టడీస్‌ విద్యార్థులకు  అందిస్తారు. సోషల్‌ సైన్సెస్, హ్యుమానిటీస్‌ విభాగాల్లో పీహెచ్‌డీ చేస్తున్న వారికి  ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి ఏటా అరవై వేల డాలర్ల స్కాలర్‌షిప్‌తోపాటు 20 వేల డాలర్ల ట్రావెలింగ్‌ అలవెన్స్‌ లభిస్తుంది.
వెబ్‌సైట్‌: www.trudeaufoundation.ca

► వేనియర్‌ కెనడా గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్స్‌: కెనడియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసెర్చ్, నేచురల్‌ సైన్సెస్, ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కెనడా, సోషల్‌ సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకం... వేనియర్‌ కెనడా గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్స్‌. కెనడాలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాన్ని ఖరారు చేసుకున్న అభ్యర్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏటా యాభై వేల డాలర్లు చొప్పున మూడేళ్లపాటు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.
వెబ్‌సైట్‌: vanier.gc.ca

► కెనడా గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్స్‌–మాస్టర్స్‌ ప్రోగ్రామ్స్‌: ఇది కెనడా ప్రభుత్వ గుర్తించిన యూనివర్సిటీల్లో మాస్టర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకం. ఏటా కెనడా సహా అన్ని దేశాలకు సంబంధించి మొత్తం 2,500 మందికి వీటిని అందజేస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి 17,500 డాలర్లు స్కాలర్‌షిప్‌గా లభిస్తుంది.  
వెబ్‌సైట్‌: https://www.nserc-crsng.gc.ca/

మరిన్ని వార్తలు