తల్లి గర్భంలోనే రుచుల మక్కువ

29 Sep, 2022 05:08 IST|Sakshi
మామూలుగా ఉన్న గర్భస్థ పిండం; నవ్వు ముఖంతో... ; ముఖం చిట్లిస్తూ...

గర్భిణి తీసుకొనే ఆహారాన్ని బట్టి శిశువుల ఇష్టాయిష్టాలు..

డర్హామ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి

లండన్‌: కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలపై జిహ్వచాపల్యం ప్రదర్శిస్తారు. మరికొందరు వాటిని చూడగానే ఇబ్బందిగా మొహంపెడతారు. ఇలా ఆహారాన్ని ఇష్టపడడం లేదా పడకపోవడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుందని ఇంగ్లాండ్‌లోని డర్హాం యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తల్లి తీసుకొనే ఆహారం, వాటి రుచులకు గర్భంలోని శిశువులు చక్కగా స్పందిస్తున్నట్లు గమనించారు. 18–40 ఏళ్ల వయసున్న 100 మంది గర్భిణులకు 4డీ అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ నిర్వహించారు. 32, 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు రెండుసార్లు స్కానింగ్‌ చేశారు. 100 మందిని మూడు గ్రూపులుగా విభజించారు.

స్కానింగ్‌కు 20 నిమిషాల ముందు మొదటి గ్రూప్‌లోని గర్భిణులకు క్యారెట్‌ను, రెండో గ్రూప్‌లోని వారికి క్యాబేజీని 400 ఎంజీ మాత్రల రూపంలో ఇచ్చారు. మూడో గ్రూప్‌లోని గర్భిణులకు ఏమీ ఇవ్వలేదు. క్యారెట్‌ మాత్ర తీసుకున్న మహిళల గర్భంలోని శిశువుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. క్యాబేజీ మాత్ర తీసుకున్న వారి గర్భంలోని శిశువులు మాత్రం ఇష్టం లేదన్నట్లుగా ముఖం చిట్లించారు. మాత్రలేవీ తీసుకోనివారి గర్భంలోని శిశువుల్లో ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఈ అధ్యయనం వివరాలను సేజ్‌ జర్నల్‌లో ప్రచురించారు. గర్భిణి తీసుకొనే ఆహారం శిశువును కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెప్పారు. గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే జన్మించిన బిడ్డలు చక్కటి ఆహారపు అలవాట్లు అలవర్చుకొంటారని తెలిపారు. గర్భస్థ శిశువలకు నిర్ధిష్ట ఆహారం పరిచయం చేస్తే భవిష్యత్తులో దానిపైవారు మక్కువ పెంచుకుంటారని సూచించారు.
 

మరిన్ని వార్తలు