చలో యూకే.. పోస్ట్‌ స్టడీ వర్క్‌ ఇక.. ఓకే!

12 Aug, 2021 19:44 IST|Sakshi

కొత్తగా గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా విధానం తెచ్చిన యూకే

బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ పూర్తయ్యాక పోస్ట్‌ స్టడీ వర్క్‌ అన్వేషణకు మార్గం

భారత విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించనున్న విధానం

యూకేలో ఉన్నత విద్య.. మన దేశ విద్యార్థులకు.. టాప్‌–4 డెస్టినేషన్‌! అకడమిక్‌గా పలు వెసులుబాట్లు ఉండటంతో.. మన విద్యార్థులు యూకే వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా యూకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త విధానంతో.. బ్యాచిలర్‌ నుంచి పీహెచ్‌డీ వరకు..ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. అక్కడే ఉండి పోస్ట్‌ స్టడీ వర్క్‌ అవకాశాలు అన్వేషించొచ్చు. ఉద్యోగం దొరికితే.. ఆ దేశంలోనే స్థిరపడొచ్చు. ఇంతకీ.. ఆ కొత్త విధానం ఏంటి? అంటే.. గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా!! ఈ విధానం ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా విధానంతో.. భారత విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ఈ నేపథ్యంలో.. గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా విధి విధానాలు.. భారత విద్యార్థులకు ప్రయోజనాలు.. పోస్ట్‌ స్టడీ వర్క్‌ గరిష్ట సమయం తదితర అంశాలపై విశ్లేషణ... 

అంతర్జాతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం ఇటీవల గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా విధానం ప్రవేశ పెట్టింది. ఈ విధానంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులు రెండేళ్లు, పీహెచ్‌డీ విద్యార్థులు మూడేళ్లుపాటు పోస్ట్‌ స్టడీ వర్క్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్‌ వీసా మంజూరైతే.. ఆఫర్‌ లెటర్‌ లేకపోయినా.. అక్కడే ఉండి ఉద్యోగానేష్వణ చేయొచ్చు. ఉద్యోగం లభిస్తే గ్రాడ్యుయేట్‌ వీసా కాలపరిమితి ముగిశాక.. ఇతర వర్క్‌ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు గ్రాడ్యుయేట్‌ వీసాతో ఉద్యోగం పొంది.. రెండేళ్లు, లేదా మూడేళ్ల వ్యవధి పూర్తయ్యాక.. స్కిల్డ్‌ వర్కర్‌ వీసాకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. స్కిల్డ్‌ వర్కర్‌ వీసా మంజూరైతే.. సదరు అభ్యర్థులు మరింత కాలం యూకేలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది.


గ్రాడ్యుయేట్‌ వీసాకు అర్హతలు

► జూలై 1, 2021 నుంచి గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా అమల్లోకి వచ్చింది. 
► ఈ వీసా పొందేందుకు యూకే ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలు పేర్కొంది. 
► గ్రాడ్యుయేట్‌ వీసాకు దరఖాస్తు చేసుకునే నాటికి యూకేలో ఉండాలి.
► ప్రస్తుతం స్టూడెంట్‌ వీసా లేదా చదువుల కోసం ఇచ్చే టైర్‌–4 జనరల్‌ వీసా కలిగుండాలి.
► యూకే విద్యా విధానం నిబంధనల ప్రకారం–నిర్దేశించిన కనీస కాలపరిమితితో ఆయా కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
► కనీసం 12 నెలల వ్యవధిలోని కోర్సులను స్టూడెంట్‌ వీసా లేదా, టైర్‌–4 జనరల్‌ వీసా ద్వారా చదివుండాలి.

స్టూడెంట్‌ వీసా ముగిసే లోపే
గ్రాడ్యుయేట్‌ వీసాకు దరఖాస్తు చేసుకొని.. పోస్ట్‌ స్టడీ వర్క్‌ అవకాశం పొందాలనుకునే విద్యార్థులు.. తమ స్టూడెంట్‌ వీసా లేదా టైర్‌–4 జనరల్‌ వీసా కాలపరిమితి ముగిసేలోపే గ్రాడ్యుయేట్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిబంధన కల్పిస్తున్న మరో ముఖ్యమైన వెసులుబాటు.. విద్యార్థులు తమ కోర్సులకు సంబంధించి సర్టిఫికెట్లు పొందకముందే గ్రాడ్యుయేట్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్‌ వీసా పొందేందుకు వీలుగా తాము కోర్సులు పూర్తిచేసుకున్న యూకే ఇన్‌స్టిట్యూట్‌ లేదా కాలేజ్‌ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది.


‘ఆన్‌లైన్‌’ విద్యార్థులకూ.. అవకాశం

కరోనా కారణంగా యూకే యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌ విధానంలో కోర్సులు చదివిన విద్యార్థులు కూడా గ్రాడ్యుయేట్‌ వీసా విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా పరిస్థితుల్లో 2020 నుంచి లాక్‌డౌన్, విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దాంతో విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించి... బోధన సాగించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజాగా ఈ వెసులుబాటు కల్పించారు. ఫలితంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితితో స్టూడెంట్‌ వీసా లేదా టైర్‌–4 వీసా కలిగి.. జనవరి 24, 2020 నుంచి సెప్టెంబర్‌ 27, 2021లోపు యూకే ఇన్‌స్టిట్యూట్‌లలో యూకే వెలుపలే ఉంటూ.. ఆన్‌లైన్‌ విధానంలో కోర్సులు అభ్యసించిన విద్యార్థులు గ్రాడ్యుయేట్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు
► గ్రాడ్యుయేట్‌ వీసాకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది.
 
► పాస్ట్‌ పోర్ట్‌ ఐడెంటిటీ ప్రూఫ్, స్కాలర్‌షిప్‌ లేదా స్పాన్సర్‌షిప్‌ ప్రొవైడర్‌ నుంచి ధ్రువీకరణ పత్రం, కోర్సు ప్రవేశ సమయంలో ఇచ్చే కన్ఫర్మేషన్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ ఫర్‌ స్టడీస్‌(సీఏఎస్‌) రిఫరెన్స్‌ నెంబర్, బయో మెట్రికల్‌ రెసిడెన్స్‌ పర్మిట్‌లను సిద్ధంగా ఉంచుకోవాలి.

► పీహెచ్‌డీ విద్యార్థుల విషయంలో అకడమిక్‌ టెక్నాలజీ అప్రూవల్‌ స్కీమ్‌ సర్టిఫికెట్‌ కూడా అవసరం.

ఎనిమిది వారాల్లో నిర్ణయం
ఆన్‌లైన్‌లో గ్రాడ్యుయేట్‌ వీసా దరఖాస్తును పరిశీలించి.. తుది నిర్ణయం తీసుకునేందుకు గరిష్టంగా ఎనిమిది వారాల సమయం పడుతుందని యూకే ఇమిగ్రేషన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తుకు ఆమోదం లభిస్తే ఈ–మెయిల్‌ లేదా యూకే ఇమిగ్రేషన్‌ పోర్టల్‌లో దానికి సంబంధించిన ధ్రువీకరణను తెలుసుకోవచ్చు. 


గ్రాడ్యుయేట్‌ వీసాతో ప్రయోజనాలు

► కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ సాగించే అవకాశం లభిస్తుంది.
► ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసుకునే వీలుంటుంది. 
► స్వయం ఉపాధి పొందొచ్చు. స్వచ్ఛంద సేవకు అవకాశం ఉంటుంది. 
► గ్రాడ్యుయేట్‌ వీసా కాల పరిమితి సమయంలో యూకే నుంచి స్వదేశానికి లేదా ఇతర దేశాలకు వెళ్లి, మళ్లీ యూకేకు తిరిగిరావచ్చు. 

నిపుణుల కొరతే కారణం
► యూకేలో పలు రంగాల్లో నిపుణులైన మానవ వనరుల కొరత కారణంగా అక్కడి ప్రభుత్వం తాజాగా గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసాను ప్రవేశ పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
► ప్రస్తుతం యూకేలో హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో నిపుణుల కొరత కనిపిస్తోంది. 

► 2030 నాటికి ఆరు లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యం కూడా తాజా గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా విధానం తేవడానికి మరో కారణంగా చెబుతున్నారు. 


భారత విద్యార్థులకు ప్రయోజనం

గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసాతో భారత విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. గత నాలుగైదేళ్లుగా యూకేకు వెళుతున్న భారత విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తాజా విధానంతో వేల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్‌ వీసాకు దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది. ఈ వీసా కాల పరిమితి సమయంలో అక్కడే ఉండి ఉద్యోగం సాధించి.. అక్కడే పర్మనెంట్‌ రెసిడెన్సీ కూడా పొందొచ్చు. 

యూకేలో విద్యార్థులు
యూకేలో విద్య కోసం గత నాలుగేళ్లుగా భారత్‌ నుంచి వెళుతున్న విద్యార్థుల సంఖ్య వివరాలు..
    » 2016    –  11,328
    »  2017    –  14,435
    »  2018    –  19,505
    »  2019    –  34,540
    »  2020    –  49,884

గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా.. ముఖ్యాంశాలు
► జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా విధానం.
► బ్యాచిలర్, పీజీ విద్యార్థులు రెండేళ్లు; పీహెచ్‌డీ అభ్యర్థులు మూడేళ్లు అక్కడే ఉండి పోస్ట్‌ స్టడీ వర్క్‌ అవకాశాలు అన్వేషించొచ్చు. 
► 2020, 2021లో యూకేలోని వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సులు అభ్యసించిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం.
► కోవిడ్‌ నేపథ్యంలో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్‌ విధానంలో అభ్యసించిన వారు కూడా అర్హులే.
► ఉద్యోగం సొంతం చేసుకున్నాక.. వర్క్‌ వీసాకు బదిలీ చేసుకునే వీలుంటుంది.
► కోర్సుల సర్టిఫికెట్లు రాకముందే గ్రాడ్యుయేట్‌ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు.

ఎంతో సానుకూల అంశం
యూకే తాజా నిర్ణయం.. భారత విద్యార్థులకు ఎంతో సానుకూల అంశంగా చెప్పొచ్చు. యూకేలోని విదేశీ విద్యార్థుల విషయంలో భారత్‌ రెండో స్థానంలో ఉంటోంది. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. గ్రాడ్యుయేట్‌ వీసా ద్వారా భారత విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రయోజనం పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం విదేశీయులకు ఇచ్చే వీసాల విషయంలోనూ.. దాదాపు యాభై శాతం వీసాలు మన దేశానికి చెందిన వారికే లభిస్తున్నాయి. 
– జె.పుష్పనాథన్, డైరెక్టర్‌ (సౌత్‌ ఇండియా), బ్రిటిష్‌ కౌన్సిల్‌ 

మరిన్ని వార్తలు