సూడాన్‌: అమెరికా, సౌదీ దౌత్యం.. సంబురపడేలోపే కథ మళ్లీ మొదటికి!

23 May, 2023 10:29 IST|Sakshi

వారంపాటు కాల్పుల విరమణకు అంగీకరించిన సూడాన్‌ ఆర్మీ, పారామిలిటరీ బలగం(RSF).. మళ్లీ కయ్యానికి దిగాయి. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన కొద్దినిమిషాల వ్యవధిలోనే పరిస్థితి మళ్లీ తలపడడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. 

అమెరికా, సౌదీ అరేబియా దౌత్యంతో ఎట్టకేలకు వారంపాటు కాల్పుల విరమణకు సూడాన్‌లో అంతర్యుద్ధానికి దిగిన ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే.. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ విరమణ అమలులోకి రాగా..  కాసేపటికే ఇరు వర్గాలు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. చాలా ప్రాంతాల్లో మళ్లీ కాల్పులకు, వైమానిక దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా రాజధాని ఖార్తోమ్‌లో ఈ దాడులు హోరాహోరీగా కొనసాగుతున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే.. ఇరువర్గాలతో పలుదఫాలుగా చర్చించి ఒప్పంద పత్రాలపై సంతకాల ద్వారా కాల్పుల విమరణకు ఒప్పించాయి అమెరికా, సౌదీ అరేబియాలు. తద్వారా తీవ్ర మారణ హోమం నుంచి వీలైనంత మేర ప్రజల్ని తప్పించాలని భావించాయి. అంతేకాదు.. గతంలో కాల్పుల విమరణ ఉల్లంఘనలా తరహా కాకుండా ఈసారి ఇరువర్గాలు కచ్చితంగా పాటిస్తాయని ఈ సందర్భంగా ఆ దేశాలు భావించాయి.

అందుకు తగ్గట్లే ఆర్‌ఎస్‌ఎఫ్‌ నేత మొహమ్మద్‌ హమ్దాన్‌ డగాలో.. సౌదీ అరేబియా, అమెరికాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విటర్‌ ద్వారా ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. కానీ, పరిస్థితిలో మార్పు మాత్రం రాలేదు. పక్కా ఒప్పందాన్ని సైతం ఉల్లంఘించి ఇరువర్గాలు మళ్లీ తలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్మీ, పారామిలిటరీ బలగం ఆర్‌ఎస్‌ఎఫ్‌ మధ్య ఆధిపత్య పోరులో సూడాన్‌ సాధారణ పౌరులు నలిగిపోతున్నారు.  ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి కాల్పులు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఐదువారాలుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో  వందల మంది మరణించగా.. లక్షల మంది చెల్లాచెదురు అయ్యారు.

మరిన్ని వార్తలు