రోజుకి వెయ్యి కోట్ల డాలర్ల నష్టం

26 Mar, 2021 03:40 IST|Sakshi
నౌక వద్ద ఇసుకమేటలను తొలగిస్తున్న దృశ్యం

సూయజ్‌ కాలువలో ఇరుక్కుపోయిన భారీ సరకు రవాణా నౌక 

దీంతో నిలిచిపోయిన 180కిపైగా రవాణా నౌకలు

ఇస్మాలియా(ఈజిప్ట్‌): అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఈజిప్టులోని సూయజ్‌ కాలువలో అత్యంత భారీ సరకురవాణా నౌక చిక్కుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 180కిపైగా చమురు, సరకు రవాణా నౌకలు ఎటూ వెళ్లలేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో రోజుకి దాదాపుగా వెయ్యి కోట్ల డాలర్లు నష్టం వస్తున్నట్టుగా అంచనా. ఆసియా, యూరప్‌ దేశాల మధ్య సరుకు రవాణా చేసే పనామాకు చెందిన ఎవర్‌ గివెన్‌ అనే భారీ నౌక సూయజ్‌ కాలువ మార్గంలో అడ్డంగా ఇరుక్కుంది. 2 లక్షల మెట్రిక్‌ టన్నుల బరువు ఉండే ఈ నౌకని ముందుకి కదల్చడం సాంకేతిక నిపుణులకు సవాల్‌గా మారింది. కాగా, ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని, వీరంతా భారతీయులేనని నౌక యజమాని చెప్పారు.

నౌక ఎలా చిక్కుకుంది ?
సూయజ్‌ కాలువ మానవ నిర్మితం కావడంతో అక్కడక్కడా మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయి. చైనా నుంచి నెదర్లాండ్స్‌కు వెళుతున్న ఈ భారీ నౌక మంగళవారం ఇరుకు మార్గం దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాంతంలో తుపాను వాతావరణం నెలకొని ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఆ రాకాసి గాలుల ధాటికి తీర ప్రాంతంలో ఇసుక కాల్వలో చేరి మేటలు వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందున్న మార్గం కనిపించకపోవడంతో సిబ్బంది నౌకపై నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ నౌక ఇసుక మేటల్లో అడ్డంగా కూరుకుపోయింది.  

ఎంత భారీ నౌక ?..: ఈ నౌక ఈఫిల్‌ టవర్‌ కంటే పొడవైనది. మూడు ఫుట్‌బాల్‌ గ్రౌండ్ల కంటే పెద్దది. ఈ నౌకలో మొత్తం పన్నెండు అంతస్తులు ఉన్నాయి. ఈ నౌక ఇంచుమించుగా 1300 అడుగుల పొడవు, 193
అడుగుల వెడల్పు ఉంటుంది.  

నౌకని బయటపడేయడం ఎలా ?  
నౌకను మళ్లీ కదల్చడం అంత సులభంగా జరిగేది కాదని నావికారంగ నిపుణులు చెబుతున్నారు. నౌక చుట్టూ పేరుకుపోయిన ఇసుక బురదను తొలగించడానికి డ్రెడ్జింగ్‌ పరికరాలతో గత రెండు రోజులుగా యత్నిస్తున్నారు. నౌక అడుగున ఉన్న బురద వదులైతే నౌకని నిలువుగా తిప్పడానికి కుదురుతుందని ఆ నౌక మేనేజర్‌ బెర్న్‌హర్డ్‌ చెబుతున్నారు. అయితే దీనికి ఎంత సమయం పడుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే నౌకని ముందుకు కదలేలా చేయవచ్చునని, లేదంటే వారాలైన పట్టవచ్చునని ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్న డచ్‌ కంపెనీ బోస్కలిస్‌ సీఈవో పీటర్‌ బెర్డోవ్‌స్కి తెలిపారు. కాలువలో భారీగా కెరటాలు వస్తే నౌక ముందుకు కదిలే అవకాశం ఉందని, ఆ స్థాయిలో కెరటాలు రావాలంటే ఆది, సోమవారాల వరకు వేచి చూడాలని సాల్వేజ్‌ మాస్టర్‌ నిక్‌ సోలెన్‌ చెప్పారు.  

ఎందుకింత ఆందోళన ?  
120 మైళ్లున్న సూయజ్‌ కాలువను 1869లో నిర్మించారు. ఉత్తరాన మధ్యధరా సముద్రాన్ని, దక్షిణాన ఉన్న ఎర్ర సముద్రాన్ని ఇది కలుపుతుంది. ఆసియా, యూరప్‌ దేశాల మధ్య సరకు రవాణా జరగాలన్నా, అరబ్‌ దేశాల నుంచి చమురు యూరప్‌ దేశాలకు , అక్కడ్నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఈ కాలువే ఆధారం. అంతర్జాతీయ వాణిజ్యంలో 12% ఈ కాలువ ద్వారా జరుగుతుంది. ప్రపంచంలోని వాణిజ్య నౌకల్లో 30% ఈ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి.

కరోనా సంక్షోభం ప్రపంచ దేశాలను కుదిపేసినప్పటికీ 2020లో 19వేల నౌకలు ఈ మార్గం వెంబడి ప్రయాణించాయి. అంటే సగటున రోజుకి 52 నౌకలు రాకపోకలు సాగించాయి. 1.17 బిలియన్‌ టన్నుల సరకు రవాణా జరిగింది. ఇప్పుడు భారీ నౌక కాలువలో అడ్డంగా ఇరుక్కుపోవడంతో కాల్వకి రెండు వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయినట్టుగా ఈజిప్టు అధికారులు వెల్లడించారు. రవాణా స్తంభించడంతో యూరప్‌ దేశాల్లో వాణిజ్యంపై ప్రభావం పడింది. చమురు ధరలు భగ్గుమన్నాయి. బారెల్‌కు 5శాతం పెరిగిపోయాయి.
కాలువ మార్గంలో అడ్డంగానిలిచిన ఎవర్‌ గివెన్‌

మరిన్ని వార్తలు