వీడియో: సూపర్‌ టైపూన్‌ హిన్నమ్నోర్‌.. గంటకు 314 కిలోమీటర్ల ప్రచండ గాలులు.. చిగురుటాకులా వణుకు

31 Aug, 2022 19:22 IST|Sakshi

టోక్యో: ఈ ఏడాదిలో అత్యంత శక్తివంతమైన గాలివాన తుపానుగా అభివర్ణిస్తున్న హిన్నమ్నోర్‌.. ఇప్పుడు దక్షిణాసియా దేశాలను వణికిస్తోంది. మహా ప్రళయమే ముంచుకొస్తోందా అనే రేంజ్‌లో ముందుకొస్తోంది తుపాను. జపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం.. తూర్పు చైనా సముద్రం నుంచి ఈ బలమైన ఉష్ణమండల తుపాను జపాన్‌ దీవుల దూసుకువస్తోంది. దీంతో తూర్పు చైనా, జపాన్ సహా పలు దేశాలు, దక్షిణ దీవులు భయాందోళనలకు లోనవుతున్నాయి. 

సూపర్‌ టైపూన్‌ హిన్నమ్నోర్‌గా నామకరణం చేసిన ఈ శక్తివంతమైన తుపాను.. 50 అడుగుల ఎత్తులో..  గంటకు 160 మైళ్లు(257 కిలోమీటర్ల) వాయువేగంతో దూసుకొస్తోందని అమెరికా జాయింట్‌ టైపూన్‌ వార్నింగ్‌ సెంటర్‌ ప్రకటించింది.  ఈ ప్రభావంతో గాలులు గంటకు 195 మైళ్ల (314 కిలోమీటర్ల) వేగంతో వీస్తాయని హెచ్చరించింది. ఈ ప్రభావం.. చైనా, జపాన్‌తో పాటు ఫిలిప్పీన్స్‌పైనా తీవ్రంగా చూపించనుంది. చిన్న చిన్న ద్వీపాలపై దీని ప్రభావం మరింతగా ఉండొచ్చని భావిస్తోంది.  అయితే దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలు, భారత్‌ తీర ప్రాంతాలపై ప్రభావం తక్కువగా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ ఏడాదిలో వేగం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దూసుకొచ్చిన 11 తుపానులలో.. హిన్నమ్నోర్‌ అత్యంత శక్తివంతమైన తుపానుగా పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు. మరోవైపు జపాన్‌ ఒకినావా నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయం తుపాను కేంద్రీకృతమై ఉందని, గంటకు 22 కిలోమీటర్ల వేగంతో రియూక్యూ ద్వీపాల వైపు దూసుకొస్తోందని హాంకాంగ్‌ అబ్జర్వేటరీ ప్రకటించింది. ఇప్పటికే జపాన్‌ తీర ప్రాంతాల వెంబడి బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్రమక్రమంగా పశ్చిమం వైపు కదులుతూ ఈ తుపాను బలహీన పడొచ్చని అంచనా వేస్తు‍న్నారు.

ఇదిలా ఉంటే.. ఆఫ్రికా, కరేబియన్‌ మధ్య ఉండే అట్లాంటిక్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రశాంతత వాతావరణం నెలకొంది అక్కడ. సాధారణంగా ఆగస్టు నెల తుపాను సీజన్‌ అయినప్పటికీ.. దాదాపు 25 తర్వాత ఈ రీజియన్‌లో ఇలా ప్రశాంత వాతావరణం కనిపిస్తుండడంపై వాతావరణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: అమెరికాకు గట్టి షాక్‌ ఇచ్చిన చిన్న ద్వీపం

మరిన్ని వార్తలు