సూపర్‌ఫెటేషన్‌ : అత్యంత అరుదైన ఘటన

31 Mar, 2021 14:16 IST|Sakshi
ఇద్దరు పిల్లలు భర్తతో రెబెక్కా

లండన్‌ : కడుపుతో ఉన్న మహిళ మళ్లీ గర్భందాల్చిన అత్యంత అరుదైన ఘటన ఇంగ్లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. ఇంగ్లాండ్‌లోని బాత్‌కు చెందిన రెబెక్కా రాబర్ట్స్‌ అనే మహిళ కొద్దినెలల క్రితం గర్భం దాల్చింది. అయితే కడుపుతో ఉండగానే భర్తతో శృంగారంలో పాల్గొంది. దీంతో ఆమె మరో సారి గర్భవతి అయింది. గత సంవత్సరం సెప్టెంబర్‌ 17వ తేదీన బాత్‌లోని యునైటెడ్‌ హాస్పిటల్‌లో ఆడ,మగ బిడ్డలకు జన్మనిచ్చింది. ఆడ బిడ్డకు రొసలీ అని పేరు పెట్టగా.. మగ బిడ్డకు నోవా అని పేరు పెట్టారు. ఆడ బిడ్డతో పోల్చుకుంటే మగ బిడ్డ పరిమాణంలో చాలా చిన్నగా బలహీనంగా ఉన్నాడు. దీంతో అతడిని 95 రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉంచి చికిత్స చేయించారు. దీంతో బాలుడు ఆరోగ్యంగా తయారయ్యాడు. ప్రస్తుతం నోవాకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికి మరో మూడు వారాల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు
తెలియజేశారు.  ‘‘సూపర్‌ఫెటేషన్‌’’ కారణంగానే రెబెక్కా కడుపుతో ఉండగానే మరోసారి గర్భం దాల్చిందని చెప్పారు.

‘‘సూపర్‌ఫెటేషన్‌’’ అంటే ఏమిటి? 
సాధారణంగా స్త్రీలు గర్భం దాల్చగానే అండాశయం అండాలను విడుదల చేయటం నిలిపేస్తుంది. కానీ, సూపర్‌ఫెటేషన్‌ అనబడే ఓ అత్యంత అరుదైన సందర్భంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది. గర్భంతో ఉన్నప్పటికి అండాలు విడుదలవుతాయి. ఈ‌ సమయంలో శృంగారంలో పాల్గొంటే వీర్యం అండాన్ని చేరి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. సూపర్‌ఫెటేషన్ ప్రపంచవ్యాప్తంగా‌ 0.3శాతం మహిళల్లో మాత్రమే జరుగుతుంది.

మరిన్ని వార్తలు