సిడ్నీలో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే కుప్పకూలిన 7 అంతస్తుల భవనం!

25 May, 2023 22:27 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న 7 అంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సుమారు 100 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. 

వివరాల ప్రకారం.. సర్రీ హిల్స్‌ ప్రాంతంలో ఉన్న ఓ 7 అంతస్తుతల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మొదటగా 3 అంతస్తుల్లో మాత్రమే మంటలు మొదలైనప్పటికీ చూస్తుండగానే భవనమంతా వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు భారీ ఎత్తున ఎగిసిడటంతో చుట్టు పక్కల భవనాలు కూడా ఆ మంటలు వ్యాపించాయి. దీంతో ఆ పరిసరాలంతా దట్టమైన పొగ కమ్మేసింది.

అగ్ని ప్రమాదం కారణంగా భవనం పూర్తిగా దెబ్బతిని చూస్తుండగానే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు 100 అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీప భవనాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిమాపక కార్యకలాపాలు కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలోకి ప్రజలు ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు.
 

చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద హైవే.. 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!

>
మరిన్ని వార్తలు