వణికిస్తున్న‘డెల్టా’.. అక్కడ మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ 

26 Jun, 2021 01:53 IST|Sakshi
సిడ్నీలో కోవిడ్‌ పరీక్షల కోసం వాహనాల్లో జనం బారులు 

ఇజ్రాయెల్‌లో మళ్లీ మాస్కులు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న‘డెల్టా’

సిడ్నీ: భారత్‌లో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కోవిడ్‌–19 డెల్టా వేరియెంట్‌ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనాను జయించామని ప్రకటించుకున్న ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లలో డెల్టా వేరియెంట్‌ కేసులు వెలుగులోకి రావడంతో మళ్లీ ఆంక్షలు విధించారు. ఆఫ్రికా దేశాల్లో ఈ వేరియెంట్‌తో మూడో వేవ్‌ ఉధృత దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరమైన సిడ్నీలో లాక్‌డౌన్‌ విధించారు.

ఆస్ట్రేలియాలో సాధారణ పరిస్థితులు నెలకొన్న కొన్ని నెలల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదుకావడం ఆ దేశాన్ని షాక్‌కి గురి చేస్తోంది. సిడ్నీలో కేవలం రెండు వారాల్లోనే 65 కేసులు నమోదయ్యాయి. సిడ్నీ విమానాశ్రయం నుంచి క్వారంటైన్‌ హోటల్‌కి ప్రయాణికుల్ని తీసుకువెళ్లిన డ్రైవర్‌కి తొలుత వైరస్‌ సోకింది. ఆ తర్వాత అత్యంత వేగంగా కేసులు వెలుగులోకి రావడం మొదలయ్యాయి. దీంతో ఒక వారం పాటు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దంటూ సిడ్నీలో పూర్తి లాక్‌డౌన్‌ విధించారు.  

ఒకే రోజు 227 కేసులు
ఇజ్రాయెల్‌లో మాస్కులు అక్కర్లేదని ప్రభుత్వం ప్రకటించిన కొద్ది వారాల్లోనే డెల్టా వేరియెంట్‌ కేసులు విజృంభించాయి. రోజుకి 100 వరకు ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం ఒక్క రోజే 227 కేసులు నమోదు కావడంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోవిడ్‌ సోకిన వారెవరూ ఆస్పత్రి అవసరం లేకుండా ఇంట్లోనే కోలుకోవడం ఊరట కలిగించే అంశమని ఇజ్రాయెల్‌ కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ చీఫ్‌ నచ్‌మాన్‌ ఆష్‌ చెప్పారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఒక్క కేసు కూడా బయటకు రాని ఫిజిలో ప్రస్తుతం రోజుకు 300 వరకు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రష్యాలో రోజుకి 20 వేల కేసులు నమోదవుతున్నాయి. ఆఫ్రికాలోని 12 దేశాల్లో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఆఫ్రికాలోని 14 దేశాల్లో డెల్టా వేరియెంట్‌ కేసులు కనిపిస్తే కాంగో, ఉగాండాలో అత్యధికంగా నమోదవుతున్నాయని ఆఫ్రికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (ఆఫ్రికా సీడీసీ) డైరెక్టర్‌ జాన్‌ కెంగసాంగ్‌ చెప్పారు.  
(చదవండి: పండ్ల రసాలు, కెచప్‌లతో కొవిడ్‌ ఫేక్‌ పాజిటివ్‌!)

మరిన్ని వార్తలు