సిరియా ఆస్పత్రిపై రాకెట్‌ దాడులు.. 13 మంది మృతి 

14 Jun, 2021 02:08 IST|Sakshi

బీరూట్‌: సిరియాలోని ఆఫ్రిన్‌ నగరంలో ఉన్న అల్‌–షైఫా ఆస్పత్రిపై రాకెట్‌ బాంబులతో దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది మృతి చెందినట్లు ఆ దేశం వెల్లడించింది. దీనిపై హతాయ్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ స్పందిస్తూ ఆస్పత్రిపై శనివారం రెండు రాకెట్‌ బాంబులతో దాడి జరిగిందని, అందులో 13 మంది మరణించడంతోపాటు 27 మంది గాయపడ్డారని ధృవీకరించారు. సిరియాలోని బ్రిటన్‌కు చెందిన మానవహక్కుల సంస్థ మాత్రం మొత్తం 18 మంది మరణించినట్లు పేర్కొంది. మరణించినవారిలో ఇద్దరు మెడికల్‌ స్టాఫ్‌ కూడా ఉన్నట్లు పేర్కొంది.

దాడి కారణంగా ఆస్పత్రిలోని సర్జరీ, ప్రసూతి విభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆస్పత్రిని మూసేసినట్లు తెలిపింది. కుర్దులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని 2018లో టర్కీ–సిరియా బలగాలు కలసి అదుపులోకి తీసుకున్నాయి. దీంతో కుర్దిష్‌లు అక్కడ మైనారిటీలుగా మారడంతో పాటు మిలిటెన్సీ వైపు అడుగులు వేయడంతో ప్రభుత్వానికి, కుర్దిష్‌లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుర్దులే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రభుత్వం ఆరోపిస్తుంది. కుర్దుల నేతృత్వంలోని సిరియన్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌ నేత మజ్లోమ్‌ అబాది ఈ ఘటనను ఖండించారు. తాము ఈ ఘటనకు పాల్పడలేదని తెలిపారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు