జూడో క్లాస్‌; బాలుడిని 27 సార్లు నేలకేసి కొట్టాడు

30 Jun, 2021 17:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తైపీ: జూడో క్లాస్‌ ఏడేళ్ల బాలుని నిండు ప్రాణాలు తీసింది. జూడోక్లాస్‌ అంటూ కోచ్‌ 27 సార్లు ఆ బాలుడిని నేలకేసి కొట్టడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. 70 రోజుల పాటు కోమాలో ఉ‍న్న ఆ బాలుడికి కొన్ని రోజులగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా.. ఉన్నట్టుండి  బాలుడి శరీరంలో కొన్ని కీలక అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో తల్లిదండ్రుల అనుమతితో వైద్యులు బాలుడిని వెంటిలేటర్‌ పైనుంచి తొలగించారు. ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది.

తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. ఏడేళ్ల హువాంగ్ జూడో నేర్చుకోవడానికి ఏప్రిల్‌ నెలలో హో అనే కోచ్‌ వద్ద చేరాడు. జూడో బాగా రావాలంటే శారీరకంగా బలంగా ఉండాలని అక్కడికి వచ్చే పిల్లలకు చెబుతూ వారిపై ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వేధించేవాడు. గత ఏప్రిల్‌ 21న హువాంగ్‌ను టార్గెట్‌ చేసిన కోచ్‌ హో వాడిని పిలిచి జూడో మూమెంట్స్‌ అంటూ నేలకేసి కొట్టడం ప్రారంభించాడు. 12సార్లు కిందపడేసిన తర్వాత హువాంగ్‌ తల నొప్పిగా ఉందంటూ వాంతి చేసుకున్నాడు. ఆ తర్వాత తనను వదిలేయాలంటూ ఎంత ప్రాధేయపడినా కోచ్‌ కనికరించలేదు. మొత్తంగా 27 సార్లు నేలకేసి కొట్టడంతో ఆ బాలుడు సృహతప్పి పడిపోయాడు. దీంతో హువాంగ్‌ ప్రాణాలు పోయాయేమోన్న భయంతో హో అక్కడి నుంచి పారిపోయాడు.

క్లాస్‌లో ఉన్న మిగతా పిల్లలు పోలీసులకు సమాచారం అందించడంతో హువాంగ్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన ఆ బాలుడు 72 రోజలు పాటు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. కాగా బుధవారం హువాంగ్‌కు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో పాటు అవయవాలు పనిచేయకపోవడంతో వెంటిలేటర్‌ నుంచి తొలగించిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. కోచ్‌ హోపై కేసు నమోదు చేసిన  పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు. 

చదవండి: వాంటెడ్‌ క్రిమినల్‌గా ‘మార్క్‌ జుకర్‌బర్గ్‌’.. పట్టిస్తే రూ.22కోట్లు

మరిన్ని వార్తలు