చైనా హెచ్చరికలపై తైవాన్‌ ఘాటు స్పందన

21 Sep, 2020 17:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌/తైపీ: అమెరికాతో బంధం బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో యుద్ధం తప్పదంటూ చైనా చేసిన హెచ్చరికలపై తైవాన్‌ ఘాటుగా స్పందించింది. ‘‘సుదూర ప్రాంతం నుంచి వచ్చిన స్నేహితులతో కేవలం డిన్నర్‌ చేసినందుకే చంపేస్తామంటూ, బెదిరింపులకు దిగిన ఇరుగుపొరుగు వాళ్లను మీరెలా డీల్‌ చేస్తారు? అడుగుతున్నాం అంతే!’’ అంటూ అధ్యక్ష కార్యాలయానికి చెందిన అధికార ప్రతినిధి ఈ మేరకు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెదిరింపులకు ఏమాత్రం భయపడబోమని పేర్కొన్నారు. 1949లో జరిగిన పౌర యుద్ధం తర్వాత  తైవాన్‌ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపినప్పటికీ డ్రాగన్‌ ఆ దేశాన్ని ఇంకా తమ భూభాగంగానే ప్రకటించుకుంటున్న విషయం తెలిసిందే. (చదవండి: చైనాపై భగ్గుమన్న యూరప్‌)

అయితే 2016లో త్సాయి ఇంగ్‌‌- వెన్‌ తైవాన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత డ్రాగన్‌ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆమె.. అగ్రరాజ్యం అమెరికాతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక అధికారికంగా తైవాన్‌తో ఎటువంటి దౌత్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకోనప్పటికీ కఠిన సమయాల్లో ఆ దేశానికి అమెరికా ఆ దేశానికి అండగా నిలబడుతోంది.

ఈ నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త, విదేశాంగ శాఖ కీలక అధికారి కీత్‌ క్రచ్‌ గురువారం తైవాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా త్సాయి ఇంగ్‌- వెన్‌ మాట్లాడుతూ.. ‘‘తైవాన్‌, అమెరికా ఇలాగే కలిసి పనిచేస్తూ.. ఇండో- ఫసిఫిక్‌ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి, సుస్థిరతకై చర్యలు తీసుకుంటూ ఉమ్మడిగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నా. తైవాన్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. యూఎస్‌తో ఆర్థికపరమైన, ఇతరత్రా సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా చర్యలు చేపట్టనుంది’’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో తైవాన్‌ అధ్యక్షురాలి వ్యాఖ్యలపై స్పందించిన డ్రాగన్‌ దేశం అధికార మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 

తైవాన్‌ తుడిచిపెట్టుకుపోతుంది..
ఈ మేరకు..‘‘అమెరికా సీనియర్‌ అధికారితో డిన్నర్‌ చేసిన సమయంలో తైవాన్‌ నాయకురాలు త్సాయి ఇంగ్‌- వెన్‌ అమెరికాతో బంధం మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ బూనడం నిప్పుతో చెలగాటం వంటిదే. యాంటీ- సెసెషన్‌ లా ఆఫ్‌ చైనాను ఉల్లంఘించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే, యుద్ధం మొదలవడం ఖాయం. అదే జరిగితే త్సాయి తుడిచిపెట్టుకుపోక తప్పదు’’ అని గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. ఇందుకు బదులుగా తైవాన్‌ సైతం దీటుగానే సమాధానమిచ్చి తమ వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. 

కాగా కరోనా వైరస్ వ్యాప్తి, హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలు, దక్షిణ చైనా సముద్రం, ఇండో- ఫసిఫిక్‌ సముద్ర జలాల్లో దుందుడుకు చర్యలు తదితర అంశాల నేపథ్యంలో చైనా- అమెరికాల మధ్య దౌత్య, వాణిజ్యపరమైన యుద్ధం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అంతేగాక తైవాన్‌ను ప్రత్యేక దేశంగా పరిగణించవద్దంటూ డ్రాగన్‌ దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరడంతో, సానుకూలంగా స్పందించడమే గాక తైవాన్‌ను ఆరోగ్య అసెంబ్లీ సమావేశానికి ఆహ్వానించకుండా డబ్ల్యూహెచ్‌ఓ వ్యవహరించిన తీరుపై కూడా అమెరికా భగ్గుమంది. తైవాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త తైవాన్‌లో పర్యటించడం చైనాకు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పించింది. ఇక గతంలో  చెక్ సెనేట్ అధ్యక్షుడు మిలోస్ వైస్ట్రిల్ తైవాన్‌ పర్యటనకు వెళ్లినపుడు కూడా చైనా ఇలాగే స్పందించడంతో తైవాన్‌తో పాటు యూరప్‌ దేశాలు కూడా డ్రాగన్‌ తీరును తప్పుబట్టాయి.

మరిన్ని వార్తలు