అదరం.. బెదరం.. యుద్ధ విమానాలతో తైవాన్‌ తెగువ.. చైనా కౌంటర్‌పై టెన్షన్‌!

18 Aug, 2022 08:50 IST|Sakshi

తైపీ: తైవాన్‌లో అగ్రరాజ్యపు కీలక నేతల పర్యటన.. ‘తైవాన్‌ ఏకాకి కాదంటూ..’ వరుస మద్దతు ప్రకటనల నేపథ్యంలో చైనా ఉడికిపోతోంది. తమదిగా చెప్తున్న భూభాగంలో అడుగుమోపడమే కాకుండా.. తమను కవ్విస్తే ఎలాంటి చర్యలకైనా ఉపేక్షించబోమంటూ ప్రకటనలు ఇస్తూ.. తైవాన్‌ సరిహద్దులో సైనిక డ్రిల్స్‌ నిర్వహిస్తూ వస్తోంది. అయితే..    

ఎప్పుడూ లేనిది తైవాన్‌ కొండంత బలం ప్రదర్శించింది. చైనాకు పోటీగా ఆయుధ సంపత్తి ప్రదర్శనకు దిగింది. తమ వద్ద ఉన్న అత్యాధునిక ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-16వీ తో సైనిక విన్యాసాలు చేయించింది. ఈ యుద్ధవిమానాలు కూడా అమెరికా సహకారంతోనే రూపొందించినవి కావడం విశేషం.

మొత్తం ఆరు F-16v యుద్ధవిమానాలు, అందులో రెండు మిస్సైల్స్‌ను ప్రదర్శిస్తూ తైవాన్‌ తూర్పు తీర ప్రాంతమైన హువాలెయిన్‌ కైంటీ నుంచి గగనతలంలో చక్కర్లు కొట్టాయి. చైనా కమ్యూనిస్ట్ దళాల సైనిక విన్యాసాల నుంచి ముప్పు నేపథ్యంలో.. జాతీయ భద్రతను నిర్ధారించడానికి ఈ ప్రదర్శన అంటూ తైవాన్‌ బహిరంగంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే గతంలోనూ ఇలా ప్రదర్శనలకు దిగినప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ధైర్యంగా నిర్వహించడాన్ని సాహసమనే చెప్పాలి.
 
తైవాన్.. చైనా ఆక్రమణ ముప్పుతో నిత్యం భయం భయంగా గడుపుతోంది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా పాలించబడుతున్న ఈ ద్వీపం తమలో భాగమని, ఏదో ఒకరోజు.. అవసరమైతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని చైనా గతంలోనే ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు చైనా వ్యతిరేక దేశాలు తైవాన్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి.

ఇక 90వ దశకం నాటి ఎఫ్‌-16వీ యుద్ధవిమానాల స్థానంలో.. అత్యాధునిక వెర్షన్‌లను తైవాన్‌కు కిందటి ఏడాది నవంబర్‌లో అందించింది అగ్రరాజ్యం. చైనా మీద తీవ్ర వ్యతిరేకతతో ట్రంప్‌ హయాంలో తైవాన్‌కు అన్నివిధాల మద్దతు అందిస్తున్న అమెరికా. ఇప్పుడు బైడెన్‌ హయాంలోనూ ఆ నైతిక మద్దతును కొనసాగిస్తోంది.

ఇదీ చదవండి: కొడుకుతో రెస్టారెంట్‌కు వెళ్లిన కేంద్ర మంత్రి, ఆపై..

మరిన్ని వార్తలు