మూడేళ్ల  చిన్నారి.. 30 మీటర్ల ఎత్తులో

31 Aug, 2020 14:02 IST|Sakshi

తైపీ: నిన్నటి నుంచి సోషల్‌ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదానికి సంబధించిన వీడియో ఒకటి తెగ ట్రెండ్‌ అవుతోంది. మూడేళ్ల చిన్నారి గాలిపటం తోకలో చిక్కుకుని.. దాదాపు 100 అడుగుల ఎత్తు మేర ఆకాశంలోకి దూసుకెళ్లింది. లేచిన వేళ బాగుంది కాబట్టి.. ఆ చిన్నారి ఈ భయంకరమైన ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. వివరాలు.. తైవాన్‌లో కైట్‌ ఫెస్టివల్‌ జరగుతోంది. ఈ నేపథ్యంలో జనాలు ఒకచోట చేరి ఉత్సాహంగా పతంగులు ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో సదరు చిన్నారి అక్కడ నిలబడి ఎంజాయ్‌ చేస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా బలమైన గాలి వీచడం ప్రారంభించింది. దాంతో ఓ పెద్ద గాలి పటం తోక ఆ చిన్నారి నడుముకు చుట్టుకుంది. ఇంతలో గాలి వేగం పెరగడంతో కైట్‌.. అది చుట్టుకున్న చిన్నారి కూడా ఆకాశంలోకి దూసుకెళ్లింది. (చదవండి: కలవరపాటుకు గురైన డేవిడ్‌ వార్నర్‌..!)

గాలిపటం సుమారు 100 అడుగుల ఎత్తు(30 మీటర్లు) వరకు వెళ్లింది. ఇది చూసిన జనాలు భయంతో కేకలు వేస్తూ.. సాయం కోసం అరిచారు. ఇంతలో కొందరు సభ్యులు గాలిపటాన్ని నెమ్మదిగా నేలమీదకు చేర్చారు. దాని తోకలో చిక్కుకున్న చిన్నారిని బయటకు తీశారు. ఈ పీడకల ముగియడానికి దాదాపు 30 సెకన్లు పట్టింది. చిన్న చిన్న గీతలు మినహా చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంటర్నెట్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇప్పటికే మిలియన్ల మంది దీన్ని వీక్షించారు. మీరు చూడండి..

మరిన్ని వార్తలు