Corona Virus: కరోనా సోకిన ఎలుక కరవడంతో సైంటిస్టుకు పాజిటివ్

10 Dec, 2021 17:46 IST|Sakshi

దాదాపు రెండేళ్ల నుంచి కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తోంది.  కోట్లాది మంది కోవిడ్‌ భారిన పడగా.. లక్షలాది మంది ఈ మహమ్మారి బలితీసుకుంది. కరోనా తగ్గుముఖం పడతుందనుకున్న ప్రతీసారి మరో కొత్త రూపం దాల్చి మళ్లీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వేరియంట్‌లలో ఆల్ఫా, బీటాలు  పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆ తరువాత వచ్చిన డెల్లా వేరియంట్‌ మాత్రం ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది.  ఇప్పటి వరకు 57 దేశాలకు పాకింది.

కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ ఒక మనిషి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలుసు. అలాగే కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, అతని వాడిన వస్తువులు వేరే వారు తాకిన కోవిడ్‌ వ్యాపిస్తుందని తెలుసు. అయితే తాజాగా ఎలుక కరిచినా కరోనా సోకుతున్నట్లు తేలింది. తైవాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన బయో-సేఫ్టీ ల్యాబరేటరీలోని ఓ సైంటిస్ట్‌కు ఎలుక కరవడంతో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తైవాన్‌లోని టాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అకాడెమియా సినికా అనే జన్యుక్రమ విశ్లేషణ సంస్థలో పనిచేస్తున్న 20 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు తేలిందని అక్కడి ఆరోగ్య మంత్రి చెన్ షిహ్-చుంగ్ బ్రీఫింగ్ తెలిపారు.
చదవండి:కేరళలో మరోసారి బర్డ్‌ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి!

కాగా ఆమె ఈ మధ్యకాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్ ను కూడా సైంటిస్ట్‌ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక గత నెల రోజులుగా ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. చివరి సారిగా నవంబర్‌ 5న పాజిటివ్‌ నమోదైంది. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది. సైంటిస్ట్‌కు పాటివ్‌గా తేలడంతో ఆమెతో సన్నిహితంగా మెలిగిన 100 మందిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే ఎలుక కరవడం వల్లే కరోనా సోకింది అనేది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఎలుక కారణంగానే వైరస్ వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి మరింత పరిశోధన జరుగుతంద ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మహిళకు డెల్టా వేరియంట్ సోకిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సైంటిస్ట్‌కు ఎలుక కరిచిందని అధికారులు చెబుతున్నారు. 
చదవండి: ఒమిక్రాన్‌ అలజడి: భారత్‌లో మరో మూడు కేసులు..

మరిన్ని వార్తలు