చనా మసాలా, నాన్‌ ఫేవరెట్.. ఛాయ్‌ తాగితే..

16 Oct, 2020 14:57 IST|Sakshi

తనకిష్టమైన భారతీయ వంటకాల గురించి చెప్పిన తైవాన్‌ అధ్యక్షురాలు

తైపీ: భారతీయ వంటకాలంటే తమ ప్రజలకు ఎంతో ఇష్టమని, తాను కూడా అందుకు అతీతం కాదని తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌-వెన్‌ అన్నారు. భారత రెస్టారెంట్లు తమ దేశంలో ఉండటం నిజంగా అదృష్టం అంటూ కొనియాడారు. ఛాయ్‌ తాగినపుడు భారత్‌లో తనకు ఉన్న అందమైన జ్ఞాపకాలన్నీ గుర్తుకువస్తాయంటూ అభిమానం చాటుకున్నారు. ఈ మేరకు.. ‘‘ఎన్నెన్నో ఇండియన్‌ రెస్టారెంట్లకు తైవాన్‌ నివాసంగా ఉండటం అదృష్టం. తైవాన్‌ ప్రజలు వాటిని ఎంతగానో ఇష్టపడతారు. నేనైతే ఎల్లప్పుడూ చనా మసాలా, నాన్‌ తీసుకుంటాను.

ఇక ఛాయ్‌ తాగితనప్పుడల్లా, ఇండియా ప్రయాణం తాలూకు విశేషాలన్నీ జ్ఞాపకం వస్తాయి. విభిన్నమైన, రంగులతో కూడిన దేశం’’ అని ట్వీట్‌ చేశారు. అంతేగాక.. ‘‘మీకిష్టమైన భారతీయ వంటకాలు ఏమిటి?’’ అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ఇక త్సాయి ఇంగ్‌- వెన్‌ ట్వీట్‌కు స్పందించిన భారత నెటిజన్లు.. ఆమెకు ధన్యవాదాలు చెబుతూనే, ఇండియన్‌ ఫుడ్‌ నచ్చనివారు ఎవరూ ఉండరు అంటూ తమ స్పందన తెలియజేస్తున్నారు. (చదవండి: తైవాన్‌ ప్రజలకు భారత నెటిజన్ల విషెస్‌)

అదే విధంగా, తైవాన్‌ ప్రజలు సైతం ప్రెసిడెంట్‌కు ఇష్టమైన భోజనం తమకు కూడా నచ్చుతుందని, వారానికి రెండుసార్లైనా ఇండియన్‌ రెస్టారెంట్లను సందర్శిస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తైవాన్‌ నేషనల్‌ డే సందర్భంగా కూడా అత్యధిక సంఖ్యలో భారత ప్రజలు సోషల్‌ మీడియా వేదికగా త్సాయి ఇంగ్‌- వెన్‌, తైవాన్‌ పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక గత నాలుగేళ్లుగా చైనా పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, తన ఉనికి చాటుకుంటున్న తైవాన్‌ ప్రభుత్వం, ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికా అండతో విమర్శలకు పదునుపెడుతూ, డ్రాగన్‌ దేశానికి కంటిలో నలుసులా తయారైంది. (చదవండి: చైనా లేఖ; గెట్‌ లాస్ట్‌ అన్న తైవాన్!‌)

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న చైనాకు దీటుగా బదులిస్తున్న తైవాన్‌, అక్టోబరు 10న నేషనల్‌ డే సందర్భంగా డ్రాగన్‌తో ఉపయుక్తమైన చర్చలకు సిద్ధమని చెబుతూనే, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని, ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. అటు అమెరికాతోనూ, ఇటు భారత్‌తోనూ స్నేహ బంధాన్ని పెంపొందించుకుంటూ చైనాకు సవాల్‌ విసురుతోంది.

మరిన్ని వార్తలు