తైవాన్‌కి చుక్కలు చూపించేలా.. జల, వాయు మార్గాల్లో చైనా సైనిక విన్యాసాలు

26 Dec, 2022 18:45 IST|Sakshi

చైనా మళ్లీ తైవాన్‌పై కయ్యానికి కాలుదువ్వే కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ మేరకు తైవాన్‌కి సమీపంలోని జల, వాయు మార్గాల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించిందని తైవాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. దీన్ని చైనా చేస్తున్న అతిపెద్ద చొరబాటు ప్రయత్నంగా తైవాన్‌ చెబుతోంది. ఐతే చైనా మిలటరీ మాత్రం ఇది అమెరికా కవ్వింపు చర్యలకు ప్రతిగా ఈ సైనిక కసరత్తులని స్పష్టం చేసింది.

యూఎస్‌ రెచ్చగొట్టు చర్యలకు ఇది గట్టి కౌంటర్‌ అని కూడా పేర్కొంది. అంతేగాదు యూఎస్‌ తన రక్షణ బడ్డెట్లో తైవాన్‌కు రూ. 82 వేల కోట్ల సహాయం అందించిందని, దీన్ని తాము ఎన్నటికీ సహించమని తెగేసి చెప్పింది చైనా. ఈ మేరకు చైనా తైవాన్‌ గగతలంలోకి పంపించిన విమానాల్లో 6ఎస్‌యూ30 ఫైటర్‌ జెట్‌లు, హెచ్‌6 బాంబర్లు, అణుదాడులు కలిగిన డ్రోన్‌లు ఉన్నాయని తైవాన్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

చైనా తన యుద్ధ విమానాలతో 47 సార్లు తైవాన్‌ గగనతలంలోకి చొరబడినట్లు తెలపింది. తమ ప్రాంతంలోని శాంతికి విఘాతం కలిగించేలా ప్రజలను భయపెట్టడానికి చైనా ప్రయత్నిస్తోందంటూ తైవాన్‌ ఆరోపణలు చేసింది. మరోపక్క తైవాన్‌ విదేశాంగ మంత్రి తైవాన్‌లో చొరబడేందుకే చైనా ఇలా సాకులు వెతుకుతోందని మండిపడ్డారు. కాగా, రోజు రోజుకి తైవాన్‌ చైనా మధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చైనా పదే పదే చొరబడటంతో..ఏ క్షణం ఏం జరుగుతుందోనని తైవాన్‌ నిరంతరం ఆందోళన చెందుతోంది. 

(చదవండి: తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడండి..అధికారులకు జిన్‌పింగ్‌ ఆదేశాలు

మరిన్ని వార్తలు