విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు

29 Aug, 2021 05:58 IST|Sakshi

కాబూల్‌: అఫ్గాన్‌ నుంచి పశ్చిమ దళాల తరలింపు గడువు దగ్గరపడుతుండడంతో పలువురు అఫ్గాన్‌ పౌరులు దేశం విడిచిపోయేందుకు కాబూల్‌ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. దీంతో  తాలిబన్లు  ప్రజలు రాకుండా అడ్డుకొనేందుకు అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనంగా మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అఫ్గాన్‌ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబన్‌ దళాలు కాబుల్‌ రహదారులపై పహారా కాస్తున్నారు.  అమెరికా దళాలు వైదొలిగిన వెంటనే మొత్తం విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంటామని తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా చెప్పారు. తాలిబన్ల దిగ్బంధంతో విమానాశ్రయం వెలుపల ఇప్పటివరకు ఉన్న రద్దీ దృశ్యాలు కనుమరుగయ్యాయి.  శనివారం విమానాశ్రయానికి వచ్చే రోడ్డుపై తాలిబన్లు కొన్ని వార్నింగ్‌షాట్లు పేల్చడంతో పాటు, హెచ్చరికగా స్మోక్‌ బాంబులను ప్రయోగించారు.

చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం
విదేశాల నుంచి సహాయం ఆగిపోవడంతో అఫ్గాన్‌లో ఆర్థిక సంక్షోభం అలముకుంది. పలువురు ఉద్యోగులు, సామాన్య ప్రజలు బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నగదు కోసం క్యూ కట్టారు. దీంతో ఏటీఎంల్లో విత్‌డ్రాను  24గంటలకు 200 డాలర్లకు పరిమితం చేశారు. అలాగే ప్రతి కస్టమర్‌ వారానికి 200 డాలర్లు బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించాలని అఫ్గాన్‌ కేంద్ర బ్యాంకు అన్ని బ్యాంకులను ఆదేశించింది. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమన ఏర్పాట్లేనని నిపుణులు అంటున్నారు. తాలిబన్లు అందరినీ కలుపుకుపోతూ ప్రజాస్వామ్యయుతం గా వ్యవహరిస్తే తప్ప విదేశీ సాయం అందడం కష్టంగా కనిపిస్తోందన్నారు. అఫ్గాన్‌ బడ్జెట్లో 75 శాతం విదేశీ సాయం ఆధారంగా నడుస్తుంది.

మరిన్ని వార్తలు