సిద్ధిఖీని తాలిబన్లు హింసించి చంపారు!

30 Jul, 2021 10:35 IST|Sakshi

ఇండియన్‌ ఫొటోజర్నలిస్ట్‌, పులిట్జర్‌ గ్రహీత డానిష్‌ సిద్ధిఖీ(38) మరణం.. జర్నలిస్ట్‌ ప్రపంచంలో విషాదం నింపిన విషయం తెలిసిందే. కాందహార్‌ స్పిన్‌ బోల్దక్‌ వద్ద అఫ్ఘన్‌ సైన్యం-తాలిబన్ల మధ్య పోరును కవరేజ్‌ చేసే టైంలో ఆయన మరణించారు. అయితే ఆయన సాధారణ కాల్పుల్లో మరణించలేదని, తాలిబన్ల చేతుల్లో క్రూరంగా హత్యకు గురయ్యాడని ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 

న్యూయార్క్‌: ఇండియన్‌ ఫొటో జర్నలిస్ట్‌ డానిష్‌ సిద్ధిఖీ తాలిబన్ల కాల్పుల్లో చనిపోయాడని అఫ్ఘన్‌ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ ప్రమేయం లేదని చెబుతూ.. డానిష్‌ మృతిపై తాలిబన్లు సంతాపం కూడా ప్రకటించారు. అయితే తాలిబన్లు కావాలనే ఆయన్ని హింసించి చంపారని చెబుతూ.. ఈమేరకు వాషింగ్టన్‌కు చెందిన ఓ మ్యాగ్జైన్‌ గురువారం ఓ కథనం ప్రచురించింది.

‘‘ఆరోజు మిస్టర్‌ సిద్ధిఖీ అఫ్ఘన్‌ సైన్య బలగాలతో బయలుదేరారు. అయితే కొద్దిదూరం వెళ్లాక తాలిబన్‌ దాడితో వాళ్లంతా చెల్లాచెదురయ్యారు. ఈ దాడిలో సిద్ధిఖీ గాయపడగా, స్థానికంగా ఉన్న ఓ మసీదులోకి వెళ్లి వాళ్లంతా తలదాచుకున్నారు. అక్కడే ఆయనకు ఫస్ట్‌ ఎయిడ్‌ కూడా చేశారు. అయితే ఆయన మసీదులో ఉన్న విషయం నిర్ధారించుకున్నాకే తాలిబన్లు.. దాడికి తెగబడ్డారు. ప్రాణాలతో పట్టుకుని.. ఆయన సిద్ధిఖీ అని నిర్ధారించుకున్నాకే ప్రాణం తీశారు. సిద్ధిఖీని కాపాడే క్రమంలోనే అఫ్ఘన్‌ కమాండర్‌, మిగతా సభ్యులు మరణించారు’’ అని ఆ కథనం పేర్కొంది. 

‘‘భారత ప్రభుత్వ సహకారంతో సిద్ధిఖీ మృతదేహం ఫొటోలు, వీడియోలు నేనూ కొన్ని పరిశీలించా. ఆయన తల చుట్టూ గాయాలున్నాయి. బహుశా ఆయన్ని కొట్టి హింసించి ఆపై కాల్పులు జరిపి చంపి ఉంటార’’ని ఏఈఐ సీనియర్‌ రైటర్‌ మైకేల్‌ రుబెన్‌ అభిప్రాయపడ్డారు. సిద్ధిఖీని వేటాడి చంపాలన్న ఉద్దేశం వాళ్ల(తాలిబన్ల)లో స్పష్టంగా కనిపిస్తోందని, అంతర్జాతీయ సమాజం-యుద్ధ నిబంధనలు, ఉల్లంఘనలు, శాంతిసామరస్యాలు లాంటివి వాళ్ల పరిధిలో లేవనే విషయం ‍స్పష్టమవుతోందని ఆయన ఆ కథనంలో రాశారు. మరి తమ ప్రమేయం లేదని బుకాయిస్తున్న తాలిబన్లు.. ఈ అమెరికా కథనంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ముంబైకి చెందిన డానిష్‌ సిద్ధిఖీ.. నేషనల్‌ రూటర్స్‌ మల్టీమీడియా టీం హెడ్‌గా పని చేశారు. అరుదైన ఫొటోలతో అంతర్జాతీయ గుర్తింపును దక్కించుకున్నారు. రొహింగ్యా శరణార్థుల సంక్షోభాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టినట్లు చూపించి.. 2018లో ఆయన పులిట్జర్‌ ప్రైజ్‌అందుకున్నాడు.  2021 జులై 15న పాక్‌ సరిహద్దు వద్ద అఫ్ఘన్‌ సైన్యానికి-తాలిబన్లకు మధ్య జరిగిన పోరును కవర్‌ చేయడానికి వెళ్లిన ఆయన దారుణ హత్య గురయ్యారు. జర్మన్‌ సంతతికి చెందిన రికే ఆయన భార్య. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు