Taliban-Afghanistan Crisis: ప్రమాణ స్వీకారోత్సవం రద్దు చేసిన తాలిబన్లు

12 Sep, 2021 04:20 IST|Sakshi

నిధుల వృథా నివారణకేనని ప్రకటన

కాబూల్‌: కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని తాలిబన్లు రద్దు చేశారు. వనరులు, నిధుల వృ«థా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్‌ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు. ఇందుకోసం రష్యా, చైనా, ఖతార్, పాకిస్తాన్, ఇరాన్‌కు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ అకస్మాత్తుగా ప్రమాణస్వీకారోత్సవ రద్దు నిర్ణయం ప్రకటించారు. 

ప్రమాణ స్వీకారోత్సవం లేకపోయినా ప్రభుత్వం ఏర్పడి పనిచేయడం ప్రారంభమైందని తాలిబన్‌ ప్రతినిధి ఇనాముల్లా సమంగని  ప్రకటించారు. అయితే నిధుల వృథా నివారణ అనేది అసలు కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్‌ మిత్రుల ఒత్తిడి వల్లనే ఈ ఉత్సవాన్ని రద్దు చేశారని రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ తెలిపింది. 11న ప్రమాణ స్వీకారోత్సవం జరపడం అమానవీయమని, దాన్ని నిలిపివేయమని తాలిబన్లకు సలహా ఇవ్వాలని యూఎస్, నాటో దేశాలు ఖతార్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొంది. దీనివల్ల అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు గుర్తించడం మరింత కఠినతరమవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు