Afghanistan Taliban: తాలిబన్ల ఆధీనంలోకి కాందహార్‌

13 Aug, 2021 08:10 IST|Sakshi

అఫ్గానిస్థాన్‌లో కొనసాగుతున్న హింస

కాందహార్‌ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు

తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు సిద్ధమైన అఫ్గాన్‌ ప్రభుత్వం

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఇటీవల అఫ్గాన్‌ భూభాగాలను మెరుపువేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్న తాలిబన్‌ సేనలు తాజాగా రెండో అతిపెద్ద నగరమైన కందహార్‌ను స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం ప్రకటించాయి. ముజాహిదీన్ నగరంలోని అమరవీరుల స్క్వేర్‌కు చేరుకున్నామని తాలిబాన్ ప్రతినిధి ట్వీట్ చేసారు. అలాగే గవర్నర్ కార్యాలయం, ఇతర భవనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. దీంతో దక్షిణ నగరం వెలుపల సైనిక కేంద్రంనుంచి ప్రభుత్వ బలగాలను  మూకుమ్మడిగా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు హింసను పక్కనబెడితే తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు సిద్ధమని అఫ్గాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిపాదనపై తాలిబన్ల ప్రతిస్పందన కోసం వేచిచూస్తోంది. కాగా దీనిపై తాలిబన్లు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అఫ్ఘానిస్థాన్‌ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు ఇప్పటికే కీలక భూభాగాలను ఆక్రమించారు.  కాబూల్‌ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడో అదిపెద్ద నగరమైన గజ్నీ పట్టణాన్ని గురువారం హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాజాగా కందహార్ పట్టణాన్ని సైతం పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. గత వారంలో అప్గాన్‌లోని 34ప్రావిన్షియల్ రాజధానుల్లో సుమారు11 ప్రాంతాలు తాలిబన్లు వశం చేసుకున్నారు. ఇపుడిక ఈ జాబితాలో తాలిబన్ల బలమైన  స్థావరం  కాందహార్ 12 వ స్థానంలో  నిలిచింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు