VIDEO: అక్రమ సంపాదనపై తాలిబన్ల గురి.. మాజీ మంత్రి ఇంట్లో సొమ్ము చూసి ఇది వాళ్ల రియాక్షన్‌!

14 Sep, 2021 08:25 IST|Sakshi

ఆర్థికంగా ముప్పావు భాగం మునిగిన అఫ్గన్‌ నావను నడిపేందుకు తాలిబన్లకు ఇప్పుడు ఆసరా అవసరం. ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) సైతం అఫ్గనిస్తాన్‌కు ఆపన్నహస్తం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈలోపు తమ వనరులను సమీకరించుకునే పనిలో పడ్డారు తాలిబన్లు. ఈ క్రమంలోనే పాత ప్రభుత్వంలోని మంత్రులు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది.  

అమ్రుల్లా సలేహ్‌.. అఫ్గనిస్తాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు. మాజీ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ  దేశం విడిచి పారిపోయిన తర్వాత.. సలేహ్‌ తనను తాను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై తాలిబన్ల ఆక్రమణ తర్వాత అజ్ఞాతంలో ఉంటూ.. తాలిబన్లతో పోరాటం కొనసాగుతుందని ప్రకటించాడు కూడా. అయితే ఆయన ఇంట్లో తాలిబన్లు తాజాగా సోదాలు నిర్వహించారు. సుమారు 6 మిలియన్ల విలువ చేసే డాలర్లు(మన కరెన్సీలో 45 కోట్ల రూ. దాకా), 18 పెద్ద బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్‌ మల్టీమీడియా బ్రాంచ్‌ చీఫ్‌ అహ్మదుల్లా ముట్టాఖీ తన ట్విటర్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశాడు.

ఇక సలేహ్‌తో పాటు ఆయనకు అనుకూలంగా పని చేసిన మంత్రులు, అధికారులు, గత పాలనలో అవినీతికి పాల్పడ్డవాళ్ల ఇళ్లలోనూ తాలిబన్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా సోమ్ము సేకరించినట్లు తెలుస్తోంది. ఇక పరారీలో ఉన్న మరికొందరి దగ్గర సొమ్ము ఉండొచ్చని భావిస్తున్న తాలిబన్లు.. ఓ లిస్ట్‌ తయారు చేసుకుని వెతుకుతున్నారు.  ఇదిలా ఉంటే అఫ్గనిస్తాన్‌ను తాలిబనిస్తాన్‌గా మారడం తనకు ఇష్టం లేదని ప్రకటించుకున్న సలేహ్‌.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పంజ్‌షీర్‌కు పారిపోయాడు. అక్కడ ప్రతిఘటన దళాల నేత అహ్మద్‌ మస్సౌద్‌తో కలిసి పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో సలేమ్‌ సోదరుడు రుల్లాహ్‌ను బంధించి, చిత్రహింసలు పెట్టి మరీ చంపారు తాలిబన్లు.

చదవండి: అఫ్గన్‌ థియేటర్ల మూత, బాలీవుడ్‌కు ఆర్థిక ముప్పు 

ఇక సెప్టెంబర్‌ 3న చివరిసారిగా పోరు కొనసాగుతుందని ప్రకటించిన సలేహ్‌.. సెప్టెంబర్‌ 6న పంజ్‌షీర్‌ తాలిబన్ల వశం అయ్యిందన్న ప్రకటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఆయన ప్రాణాలతోనే ఉన్నాడా? లేదా పరారీలో ఉన్నాడా? అనేది నిర్దారణ కావాల్సి ఉంది.

చదవండి: తాలిబన్‌ ఎఫెక్ట్‌.. భారత్‌లో అలర్ట్‌

మరిన్ని వార్తలు