నవ వధువుని మిలటరీ హెలికాప్టర్‌లో తీసుకెళ్లిన కమాండర్‌! ఆగ్రహించిన ప్రజలు

4 Jul, 2022 18:27 IST|Sakshi

Commander landing near the bride's house: తాలిబన్‌ కమాండర్‌ నవ వధువుని ఇంటికి తీసుకెళ్లేందుకు మిలటరీ హెలికాప్టర్‌ని ఉపయోగించారంటూ ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. మీడియా కథనం ప్రకారం... ఒక తాలిబన్‌ వ్యక్తి నవ వధువుని తీసుకుని మిలటరీ చాపర్‌లో పయనించాడని అఫ్గాన్‌ స్థానిక మీడియా పేర్కొంది. అతను తన భార్యను తీసుకుని ఆ చాపర్‌లో అప్గనిస్తాన్‌లోని లోగర్‌ నుంచి ఖోస్ట్‌ ప్రావిన్స్‌ వెళ్లినట్లు తెలిపింది. పైగా ఆ వ్యక్తిని హక్కాని శాఖ కమాండర్‌గా పేర్కొంది.

అంతేకాదు ఆ కమాండర్‌ నవవధువు ఇంటి దగ్గర హెలికాప్టర్‌ నుంచి దిగుతున్న వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ వ్యక్తి ఆమెని వివాహం చేసుకునేందుకు తన మామగారికి దాదాపు రూ. 10 లక్షలు పైనే చెల్లించాడని వెల్లడించింది. అంతేగాక ఆ వ్యక్తి ఖోస్ట్‌లో నివశిస్తున్నాడని, అతని భార్య  పుట్టిల్లు లోగర్‌లోని బార్కి బరాక్‌ జిల్లాలో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయంటూ కథనాలు వచ్చాయి.

ఈ విషయమై తాలిబన్‌ డిప్యూటి అధికార ప్రతినిధి ఖారీ యూసుఫ్‌ అహ్మదీ స్పందిస్తూ... ఆ వ్యాఖ్యలను ఖండించారు. సేనాధిపతి చేసిన వ్యాఖ్యలను శత్రువులు చేస్తున్న తప్పుడూ ప్రచారంగా పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఆరోపణలను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ తోసిపుచ్చింది కూడా. ఐతే ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ప్రజలు ఈ చర్యను ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఇది ప్రజా ఆస్తులను దుర్వినియోగపరచడం కిందకే వస్తుందంటూ ప్రజలు పెద్ద ఎత్తున మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు