అలా ఎలా చంపుతారు? అమెరికా డ్రోన్‌ దాడిని ఖండించిన తాలిబన్‍లు

2 Aug, 2022 12:24 IST|Sakshi

కాబూల్‌: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ దాడిపై తాలిబన్లు స్పందించారు. అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, జవహరిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. 2020లో జరిగిన అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అతిక్రమించారని పేర్కొన్నారు. ఈమేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

కాబూల్‌లోని ఓ నివాసంలో తలదాచుకున్న అల్ జవహరిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వెల్లడించారు. 9/11 దాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు.

అల్ జవహరి  కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో అమెరికా సీఐఏ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.  అతను ఇంటి బాల్కనీపైకి వచ్చినప్పుడు అదను చూసి క్షిపణులతో విరచుకుపడింది. డ్రోన్ల సాయంతో ఈ దాడి చేసింది. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి.

ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా దాదాపు 20 ఏళ్లకు పైగా అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలు గతేడాది తాలిబన్లు అధికారం చేపట్టాక వెళ్లిపోయాయి. దాదాపు 11 నెలల తర్వాత అల్‌ఖైదా చీఫ్‌ను హతమార్చేందుకు మళ్లీ అక్కడకు వెళ్లాయి. అయితే దాడి విషయంపై తాలిబన్‌లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే?

మరిన్ని వార్తలు