మీడియాపై తాలిబన్ల ఉక్కుపాదం.. కొత్తగా 11 నియమాలు

25 Sep, 2021 21:25 IST|Sakshi

కాబూల్‌​: అప్గనిస్తాన్‌లో  పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే లక్ష్యంగా తాలిబన్‌ పాలకులు కఠిన చర్యలు ప్రారంభించారు. వార్తా సంస్థలపై ఆంక్షలు విధిస్తూ కొత్తగా 11 నిబంధనలను ప్రవేశపెట్టారు. ఇస్లాం మతాన్ని, దేశంలోని ప్రముఖ నాయకులను కించపర్చేలా ఎలాంటి సమాచారం ప్రచురించిన కఠినా దండన తప్పదని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

ప్రభుత్వ మీడియా కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ పత్రికల్లో వార్తలు, వ్యాసాలు ప్రచురించాలని జర్నలిస్టులకు తాలిబన్లు హుకుం జారీ చేసినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. అఫ్గాన్‌లో పని చేస్తున్న పాత్రికేయులు తీవ్ర భయాందోళనకు గురవుతు న్నారని అమెరికాకు చెందిన ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఆర్గనైజేషన్‌ సభ్యుడు స్టీవెన్‌ బట్లర్‌ చెప్పారు. తమకు సాయం చేయాలంటూ అఫ్గాన్‌ జర్నలిస్టుల నుంచి తనకు వందలాది ఈ–మెయిళ్లు వస్తున్నా యని తెలిపారు.

అఫ్గానిస్తాన్‌ను ఆగస్టులో తాలిబన్లు మళ్లీ ఆక్రమించిన తర్వాత 150కిపైగా మీడియా సంస్థలు మూతపడినట్లు సమాచారం. దేశంలోని ప్రముఖ పత్రికలు ప్రింటింగ్‌ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఆన్‌లైన్‌ ఎడిషన్‌కు పరిమితం అవుతున్నాయి. తాలిబన్ల నుంచి ముప్పు తప్పదన్న భయంతోపాటు ఆర్థిక పరిస్థితి దిగజారడం కూడా ఇందుకు కారణం. తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలన్న డిమాండ్‌తో జనం వీధుల్లోకి వచ్చారు. ఈ నిరనస కార్యక్రమాలను, ప్రజల ఆగ్రహాన్ని ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టులపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. చాలామందిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ప్రైవేట్‌ టీవీ చానళ్ల తీరు మారిపోయింది. టీవీల్లో న్యూస్‌ బులెటిన్లు, రాజకీయ చర్చలు, వినోదం, సంగీతం, విదేశీ నాటికలు తెరమరుగయ్యాయి.

వాటి స్థానంలో తాలిబన్‌ ప్రభుత్వానికి అనుకూలమైన కార్యక్రమాలే ప్రసారమవుతున్నాయి. విలేకరులను నిర్బంధిం చడం తక్షణమే నిలిపివేయాలని కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌(సీపీజే) తాలిబన్‌ సర్కారును డిమాండ్‌ చేసింది. మీడియా కార్యకలాపాలు స్వేచ్ఛగా కొనసాగే వాతావరణం కల్పించాలని పేర్కొంది.

శవాలను వేలాడదీసిన తాలిబన్లు
అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక శిక్షలు ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. శనివారం ఓ వ్యక్తి శవాన్ని హెరాత్‌ నగరంలోని ప్రధాన కూడలిలో వేలాడదీశారని ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. మొత్తం నాలుగు శవాలను తాలిబన్లు తీసుకొచ్చారని, అందులో మూడు శవాలను వేరే చోటకు తీసుకెళ్లారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో ఆయా మృతదేహాలను వేలాడదీసేందుకే తీసుకెళ్లారని చెప్పారు.

హెరాత్‌ నగరంలోని ప్రధాన కూడలి వద్ద ఓ శవాన్ని క్రేన్‌ సాయంతో వేలాడదీశారని, ఆ ప్రదేశానికి దగ్గర్లోనే తనకు ఓ ఫార్మసీ షాపు ఉందని వాజిర్‌ అహ్మద్‌ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. దీనిపై ఉన్నతాధికారి మౌలావి షీర్‌ అహ్మద్‌ స్పందించారు. నిందితులు ఓ వ్యాపార వేత్త కుమారుడిని కిడ్నాప్‌ చేశారని, వారిని భద్రతా బలగాలు ఆపడంతో కాల్పులు జరిపారని అన్నారు.

దీంతో భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో నలుగురు కిడ్నాపర్లు మరణించారన్నారు. అనంతరం నలుగురి శవాలను వివిధ ప్రాంతాల్లో వేలాడదీశారు. ‘కిడ్నాప్‌కు పాల్పడే వారికి ఇలాంటి శిక్షే పడుతుంది’ అని రాసి ఉన్న బోర్డులను మృత దేహాలకు తగిలించారు. ఎవరూ కిడ్నాప్‌ కావడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. 

చదవండి: Afghanistan: కాళ్లు, చేతులు నరకడం శిక్షలు ఆపేదిలేదు: తాలిబన్లు

మరిన్ని వార్తలు