Viral Video: బుర్ఖా ధరించని విద్యార్థులపై తాలిబన్‌ అధికారుల దాడి

2 Nov, 2022 10:52 IST|Sakshi

కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచక పాలన రోజురోజుకీ మితిమీరిపోతుంది. గతేడాది దేశాన్ని తాలిబన్లు తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి మహిళల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చదువులు, ఉద్యోగాలకు అనుమతి నిరాకరిస్తూ మహిళలను ఆంక్షల చట్రంలో బంధిస్తున్నారు. మహిళల స్వేచ్చ, భావవ్యక్తీకరణ, వస్త్రధారణ ఇలా ప్రతి దానిపై నిషేధం విధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి బాలికలు పాఠశాలకు రాకుండా నిషేధించారు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం అయ్యేలా వారిని అణిచివేతకు గురిచేస్తున్నారు.

ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టిన మహిళలకు హిజాబ్‌(బుర్భా) ధరించడం తప్పనిసరి చేసింది తాలిబన్‌ ప్రభుత్వం. ఆఖరికి విద్యాసంస్థలకు కూడా ఇలాగే రావాలని ఆదేశించింది. అయితే అక్కడి మహిళలు తాలిబన్ల నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు బుర్భా పూర్తిగా ధరించకుండా వచ్చినందుకు అధికారులు యూనివర్సిటీ లోపలికి అనుమతివ్వలేదు. దీంతో చదవుకోవడం మా హక్కు అంటూ విద్యార్థులు ఆందోళన  బాటపట్టారు. అయితే నిరసన చేస్తున్న మహిళా విద్యార్థులపై తాలిబన్‌ అధికారులు దాడి చేశారు. దీంతో విద్యార్థులు భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు.

యూనివర్సిటీ ముందు నిరసన తెలుపుతున్న మహిళా విద్యార్థులను కొడుతున్న వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తి తాలిబాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినవారుగా తెలిసింది. ఈ సంఘటన ఆదివారం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షన్ విశ్వవిద్యాలయం గేట్‌ బయట జరిగింది. అయితే వీరంతా ముఖం కనిపించకుండా బుర్భా కప్పుకోకపోవడంతో అధికారులు యూనివర్సిటీలోకి అనుమతించలేదని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు