Afghanistan Crisis: తాలిబన్లు సంచలన ప్రకటన

18 Aug, 2021 01:55 IST|Sakshi
కాబూల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం దగ్గర తాలిబన్ల పహారా

ప్రకటించిన తాలిబన్లు 

ప్రభుత్వంలో చేరాలని మహిళలకు పిలుపు 

సహాయం నిలిపివేసిన జర్మనీ

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. దేశ ప్రజల్లో తమపై ఏర్పడిన భయాందోళనలు తొలగించే యత్నాల్లో భాగంగా మహిళలు ప్రభుత్వంలో చేరాలని పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే తాము మారిపోయామని చెప్పడానికి తాలిబన్లు యత్నిస్తున్నా, అఫ్గాన్‌ ప్రజ మాత్రం ఉలిక్కిపడుతూనే ఉంది. ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్‌ ప్రతినిధి ఎనాముల్లా సమాంగని టీవీలో చెప్పారు. ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవాలని, ప్రభుత్వ అధికారులంతా విధులకు హాజరుకావాలని ప్రకటించారు. దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఎలా ఉండబోతున్నదీ తాలిబన్లు తమ కల్చరల్‌ కమిషన్‌లో సభ్యుడైన ఎనాముల్లా ప్రకటనతో స్పష్టం చేశారు. గతంలో తమను వ్యతిరేకించిన వారు, విదేశీయులకు మద్దతునిచ్చిన వారితో సహా అందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ఎనాముల్లా చెప్పారు. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టలేదు. పాత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో తాలిబన్‌ ప్రతినిధుల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. పౌర ప్రభుత్వాలతో, విదేశీ సేనలతో కలిసి పనిచేసిన వారిపై తాము ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్‌ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పటికే తమకు వ్యతిరేకంగా పనిచేసినవారి జాబితాను తాలిబన్లు తయారు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.  

స్త్రీలే ప్రధాన బాధితులు 
గతంలో స్త్రీల హక్కులకు తీవ్రభంగం కలిగించిన తాలిబన్లు ఈ దఫా ఆశ్చర్యకరంగా మహిళలపై సానుభూతి చూపుతున్నారు. అఫ్గాన్‌లో 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభంలో మహిళలే ప్రధాన బాధితులని తాలిబన్‌ ప్రతినిధి ఎనాముల్లా తెలిపారు. ఇకపై తమ పాలనలో మహిళా బాధితులుండరన్నారు. మహిళా విద్య, ఉద్యోగాలకు తగిన వాతావరణం కల్పిస్తామని, ఇస్లామిక్‌ చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలను నియమిస్తామని చెప్పారు. అయితే ‘ఇస్లామిక్‌ చట్టం’ అంటే ఏంటనేది ఆయన వివరించలేదు. ప్రజలకు ఈ చట్టం నిబంధనలు తెలుసన్నట్లు మాట్లాడారు. ప్రజల్లో అన్ని పక్షాలు ప్రభుత్వంలో చేరాలన్నారు. స్త్రీలపై తమ వైఖరి మారిందనేందుకు సాక్ష్యం కోసం తాలిబన్‌ నేత ఒకరు మహిళా విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోవైపు ప్రజా జీవనం నుంచి స్త్రీలను దూరం చేయవద్దంటూ కాబూల్‌లో పలువురు మహిళలు హిజాబ్‌ ధరించి ప్రదర్శన చేశారు. తాలిబన్లు తాము చేసే వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, వీరి గత వైఖరి గమనిస్తే అనుమానాలు కలుగుతూనే ఉన్నాయని ఐరాస ప్రతినిధి రూపర్ట్‌ అన్నారు. రెండు దశాబ్దాల్లో అఫ్గాన్‌ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ జరిగిందని, వీటిని కాపాడాలని సూచించారు.  

ఆగిన ఆర్థిక సాయం 
2021లో అఫ్గాన్‌ అభివృద్దికి కేటాయించిన 25 కోట్ల యూరోల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే మానవతా సాయం, రక్షణ సేవలకు అందించే సాయాన్ని మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. అఫ్గాన్‌కు అందించే సాయాన్ని తగ్గిస్తామని స్వీడన్‌ మంత్రి పర్‌ ఆల్సన్‌ ఫ్రిడ్‌ చెప్పారు. సైనికుల తరలింపు కోసం అఫ్గాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరలా తెరిచారు. అఫ్గాన్‌లో ఉన్న అమెరికన్లు స్వదేశం వచ్చేందుకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకోవాలని యూఎస్‌ ఎంబసీ సూచించింది. దేశమంతా వేలాదిమంది గాయాల పాలైనట్లు రెడ్‌క్రాస్‌ తెలిపింది.


తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌

సురక్షితంగా ఉంచుతాం..
ఇస్లామిక్‌ చట్టం ప్రకారం స్త్రీలకు హక్కులు 
అఫ్గానిస్తాన్‌ను సురక్షితంగా ఉంచుతామని తాలిబన్లు ప్రకటించారు. దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అఫ్గాన్‌ భవితవ్యంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాలిబన్‌ ప్రకటన వెలువడింది. ఈ మేరకు తొలిసారి విలేకరులతో మాట్లాడిన తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ హామీ ఇచ్చారు. సంవత్సరాలుగా జబిహుల్లా బయటకు కనిపించలేదు. రహస్యంగా ఉంటూ తాలిబన్ల తరఫున ప్రకటనలు జారీ చేసేవారు. తాజాగా అందరినీ క్షమించామని, స్థానికులపై ఎలాంటి ప్రతీకారాలు తీర్చుకోమని తన ఇంటర్వ్యూలో జబిహుల్లా చెప్పారు. ‘‘ఎవరి ఇంటి తలుపు తట్టి ఎందుకు పాశ్చాత్యులకు సాయం చేశావు అని ఎవరూ అడగరు’’ అని తెలిపారు. తాలిబన్ల మాటపై దేశ ప్రజల్లో నమ్మకం చేకూరడం లేదు. మహిళా హక్కులను ఇస్లామ్‌ చట్టానికి లోబడి పరిరక్షిస్తామని జబిహుల్లా చెప్పారు. ప్రైవేట్‌ మీడియా స్వతంత్రంగా వ్యవహరించాలని, జాతీయ విలువలకు వ్యతిరేకంగా పనిచేయకూడదని కోరారు. ఇతర దేశాలతో తాము శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నామని, అంతర్గతంగా, బహిర్గతంగా ఎలాంటి శత్రువులను కోరుకోవడం లేదని తెలిపారు.  ఆఫ్గాన్‌ నుంచి ఏ దేశానికి ముప్పు ఉండదని జబిహుల్లా ప్రకటించారు. ‘ఆఫ్గానిస్తాన్‌ నుంచి ఏ దేశానికి ముప్పు ఉండదని ప్రపంచదేశాలకు మేము వాగ్ధానం చేస్తున్నాం’ అని అన్నారు. అందరి భాగస్వామ్యం ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు కోరుకుంటున్నారని తెలిపారు.   

విమానం.. ఓవర్‌ లోడ్‌
కిక్కిరిసిపోయిన జనాలతో బస్సులు, రైళ్లు, పడవల్ని ఇన్నాళ్లూ చూశాం. తాలిబన్ల పుణ్యమాని ఇప్పుడు విమానాలను కూడా అలా చూసే రోజు వచ్చింది. విమానం టేకాఫ్‌కి కాస్త ముందు ప్రాణభయంతో  పరుగు పరుగున, ఒకరినొకరు తోసుకుంటూ ప్రయాణికులు ఎక్కే రోజు ఒకటి వస్తుందని మనం కలలో కూడా ఊహించి ఉండం. ఇప్పుడు అలాంటి దృశ్యాలే కాబూల్‌ విమానాశ్రయంలో కనిపిస్తున్నాయి. అమెరికా తమ దౌత్య సిబ్బందిని తీసుకురావడానికి పంపిన సి–17 రవాణా విమానంలోకి అఫ్గాన్‌ పౌరులు పరుగులు తీసుకుంటూ వచ్చి ఎక్కారు. పిల్లా పాపలతో విమానం లోపల కిందనే  కూలబడ్డారు. కనీసం సామాన్లు కూడా వెంట తెచ్చుకోలేదు. ఎలాగైనా కాబూల్‌ని విడిచిపెడితే ప్రాణాలు దక్కుతాయన్న ఆందోళన తప్ప వారిలో మరేం కనిపించడం లేదు. 150 మంది సైనికుల్ని తీసుకువెళ్లే ఆ విమానంలో ఏకంగా  640 ఎక్కేశారు. విమానం టేకాఫ్‌కి కాస్త ముందు సగం తెరిచిన ర్యాంప్‌ మీదుగా ఒక్క ఉదుటున.. పోటెత్తిన వరదలా లోపలికి వచ్చేశారు. విమానం సిబ్బంది కూడా వారిని తీసుకునే ప్రయాణించడానికి నిర్ణయించారు. ఈ ఫొటోని అమెరికా ఎయిర్‌ఫొర్స్‌కి చెందిన సిబ్బంది సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. వారినందరినీ ఖతర్‌ విమానాశ్రయంలో దింపినట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులు పరుగులు తీసుకుంటూ విమానంలోకి ఎక్కిన వీడియోలు కూడా వైరల్‌గా మారి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి.  

ఎటు చూసినా గందరగోళమే  
అఫ్గాన్‌ తాలిబన్ల వశమైన దగ్గర్నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ వారి అరాచక పాలనను భరించే ఓపిక లేని ప్రజలు వేలాది మంది వేరే దేశాలకు వెళ్లిపోవడానికి కాబూల్‌ విమానాశ్రయంలోనే ఉన్నారు. విమానాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రజలందరికీ ఎలాంటి హాని తలబెట్టబోమని తాలిబన్లు హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితిపై తాజాగా మక్సార్‌ టెక్నాలజీ ఉపగ్రహ ఛాయా చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్రాల్లో తాలిబన్ల నుంచి దూరంగా పారిపోవాలని నిస్సహాయ స్థితిలో ఎదురు చూపులే కనిపిస్తున్నాయి. అయితే కాబూల్‌ విమానాశ్రయానికి విపరీతంగా జనం వచ్చి పడిపోతూ ఉండడంతో అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరుపుతూ వారిని చెదరగొడుతున్నాయి. రన్‌వేలపై ఉన్న విమానాలను అదేదో బస్సుల మాదిరిగా కదులుతుంటే కూడా ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు