తాలిబన్ల చెరలో జరాంజ్‌నగరం

7 Aug, 2021 06:18 IST|Sakshi

నిమ్రోజ్‌ ప్రావిన్షియల్‌   రాజధానిలో ముష్కరుల పాగా

నగర వీధుల్లో వీర విహారం

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా, యూరప్‌ దేశాల సేనలు వెనక్కి మళ్లడం మొదలైన తర్వాత తాలిబన్లకు అడ్డే లేకుండా పోయింది. దేశంలో క్రమంగా ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే 70% భూభాగం ముష్కరుల పెత్తనం కిందకు వచ్చేసింది. తాజాగా నిమ్రోజ్‌ ప్రావిన్షియల్‌ రాజధాని జెరాంజ్‌ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ గవర్నర్‌ రోహ్‌ గుల్‌ జైర్‌జాద్‌ శుక్రవారం స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

అఫ్గాన్‌ నుంచి విదేశీ సైనిక బలగాల ఉపసంహరణ మొదలైన తర్వాత తాలిబన్లు ఒక ప్రావిన్షియల్‌ రాజధానిని చెరపట్టడం ఇదే మొదటిసారి. దేశంలో ప్రధాన నగరాలను కాపాడడానికి ప్రభుత్వ దళా లు అష్టకష్టాలు పడుతున్నాయి. తాజా ఘటనతో అఫ్గాన్‌ సైనికుల ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. ఇరాన్‌ సరిహద్దుల్లోని జరాంజ్‌ నగరం ఎలాంటి ప్రతిఘటన లేకుం డానే తాలిబన్ల వశమయ్యింది. ఇక్కడ 50 వేల కుపైగా జనాభా నివసిస్తోంది. తీవ్రవాదులు జరాం జ్‌ వీధుల్లో వీర విహారం చేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీరి రాకతో స్థాని కులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ప్రభుత్వ మీడియా చీఫ్‌ కాల్చివేత
అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్‌ మీడియా సెంటర్‌ డైరెక్టర్‌ను తాలిబన్లు కాల్చి చంపారు. అఫ్గాన్‌ తాత్కాలిక రక్షణ మంత్రిపై హత్యాయత్నానికి తెగించిన కొన్ని రోజులకే ఈ ఘటనకు పాల్పడ్డారు. రాజధాని కాబూల్‌లోనే మీడియా సెంటర్‌ డైరెక్టర్‌ను తాలిబన్లు చంపేయడం చర్చనీయాంశంగా మారింది. తాలిబన్‌ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ..‘‘మా ముజాహిదీన్‌ల కాల్పుల్లో ప్రభుత్వ మీడియా సెంటర్‌ డైరెక్టర్‌ దావాఖాన్‌ మెనపాల్‌ మృతి చెందారు’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు