Afghanistan Crisis: పాకి​స్తాన్‌ మా రెండో ఇల్లు : తాలిబన్లు

26 Aug, 2021 19:30 IST|Sakshi

కాబూల్‌అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో తాలిబన్లు.. పాకిస్థాన్ తమకు రెండో ఇల్లువంటిదంటూ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. తాలిబన్‌ ఆధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్  స్థానిక మీడియాతో  మాట్లాడుతూ.. అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌ సరిహద్దులు కలిసి ఉన్న దేశాలని, మత విశ్వాసాల పరంగా కూడా తాము ఒకే కోవకు చెందిన వారమని  చెప్పారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ తమకు రెండో ఇల్లు అని వ్యాఖ్యానించారు.

ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామంటున్నారు. భారత దేశంతో పాటు అన్ని దేశాలతో  మంచి సంబంధాలను కోరుకుంటున్నామని ముజాహిద్‌ చెప్పారు. అఫ్ఘన్ గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించబోమని పేర్కొన్నారు. అఫ్గనిస్తాన్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన విధానాన్ని రూపొందిస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.

అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి తాలిబన్ చేసిన దాడిలో పాకిస్తాన్ పాత్ర ఏమీ లేదని, తమ వ్యవహారాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ఆయన అన్నారు. అమెరికా దళాలు అఫ్గనిస్తాన్‌ నుంచి ఈ నెల 31న వెళ్ళిపోయే లోపే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

చదవండి: Afghanistan: నేను చనిపోలేదు.. తాలిబన్లు చితకబాదారు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు