Afghanistan: ‘తరలింపు ఆపండి’ : అమెరికాకు తాలిబన్ల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

24 Aug, 2021 20:31 IST|Sakshi

అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న తాలిబన్ల అరాచకం

రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న తాలిబన్ల ఆంక్షలు

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్ల హెచ్చరిక

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు మరోసారి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నైపుణ్యం కలిగిన అఫ్గాన్లను తరలించుకు పోవడాన్ని నిలిపివేయాలని అమెరికాను హెచ్చరించారు. అలాగే అఫ్గన్లు దేశం విడిచి వెళ్లిపోవద్దని, కాబూల్‌లోని విమానాశ్రయానికి వెళ్లేందుకు ఇకపై అనుమతించబోమని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా వైద్యులు, ఇంజనీర్లు, ఇతర విద్యావంతులైన నిపుణులు తమకు చాలా అవసరమని మంగళవారం నాటి సమావేశంలో ప్రకటించారు.

అలాగే ప్రస్తుత గందరగోళ పరిస్థితుల కారణంగా అఫ్గాన్‌లను విమానాశ్రయానికి అనుమతించడం లేదని, విమానాశ్రయంలో ఉన్నవారు ఇంటికి వెళ్లిపోవాలని కోరారు. వారి భద్రతకు తమది  పూర్తి హామీ అని పేర్కొన్నారు.  బ్యాంకులు బుధవారం నుంచి పనిచేస్తాయని, ఆసుపత్రులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, మీడియా సంస్థలు, లోకల్‌ పాలనా సంస్థలు ఇప్పటికే పనిలో ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు మహిళలపై ఆంక్షలను కొనసాగిస్తూ కీలక ప్రకటన చేశారు. 

చదవండి : అమెరికాకు డెడ్‌లైన్‌ విధించిన తాలిబన్లు

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్‌నేత తాజా హెచ్చరిక జారీ చేశారు. తమ భద్రత కోసం వారంతా ఇంట్లోనే ఉండాలన్నారు. అయితే భవిష్యత్తులో వాళ్లు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే అమెరికా సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్‌ రహస్య మంతనాలు జరిపారన్న వార్తలను ఆయన ఖండించారు. అలాంటి సమావేశం ఏదీ  జరగలేదని తెలిపారు.

చదవండి : Afghanistan: తాలిబ‌న్ల‌తో సీఐఏ చీఫ్ ర‌హ‌స్య భేటీ!

అలాగే పంజ్‌షీర్‌ సోదరులంతా కాబూల్‌కు తిరిగి రావాలని ముజాహిద్ కోరారు. భయపడొద్దు, తిరుగుబాటు చేయొద్దని కూడా ఆయన తెలిపారు. కాబూల్‌నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకునేందుకు గడువును పొడిగించబోమని మరోసారి తెగేసి చెప్పారు. అమెరికా  తన ప్రజలందరినీ ఆగస్టు 31 లోపు తరలించాల్సిందేనని స్పష్టం చేశారు.

చదవండి : బంగారం లాంటి ఆస్తులు అమ్మేస్తున్నారు: మోదీపై రాహుల్‌ ధ్వజం

మరిన్ని వార్తలు