తాలిబన్ల వెబ్‌సైట్లు బంద్‌ !

22 Aug, 2021 05:27 IST|Sakshi

బోస్టన్‌: తాలిబన్ల అధికారిక నిర్ణయాలను ప్రపంచానికి ఐదు భాషల్లో అందిస్తున్న వెబ్‌ సైట్లు శుక్రవారం హఠాత్తుగా ‘ఆఫ్‌లైన్‌’లోకి వెళ్లిపోయాయి. తాలిబన్లను ఆన్‌లైన్‌ వేదికపై అడ్డుకునేందుకే ఇలా వెబ్‌సైట్లను క్రియాశీలక స్థితి నుంచి పక్కకు నెట్టారని వార్తలొస్తు న్నాయి.  తాలిబన్ల సందేశాలను ఈ వెబ్‌సైట్లు పష్తో, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, దారీ భాషల్లో ప్రపంచానికి అందిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లకు శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన కంటెంట్‌ డెలివరీ నెట్‌వర్క్, ప్రొటెక్షన్‌ ప్రొవైడర్‌ సేవలను ‘క్లౌడ్‌ఫ్లేర్‌’ సంస్థ అందిస్తోంది. వెబ్‌సైట్ల తాజా స్థితిపై ఆరా తీసేందుకు ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ వార్తా సంస్థ.. ‘క్లౌడ్‌ఫ్లేర్‌’ను సంప్రదించినా ఆ సంస్థ స్పందించలేదు. పలు ‘తాలిబాన్‌ గ్రూప్‌’లను వాట్సాప్‌ తొలగించిందని  ఎస్‌ఐటీఈ నిఘా సంస్థ డైరెక్టర్‌ రీటా కట్జ్‌ వెల్లడించారు. ఆన్‌లైన్‌ వేదికలపై తాలిబన్ల దూకుడు నుంచి అల్‌ఖాయిదా, ఇతర ఇస్లామిక్‌ ఉగ్రసంస్థలు స్ఫూర్తి పొందకుండా కట్టడి చేయాలని టెక్‌ దిగ్గజాలను ఆమె కోరారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు కూడా పలు తాలిబన్ల ఖాతాలను తొలగించాయి. తాలిబన్ల  ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌కు ట్విట్టర్‌లో ఏకంగా 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు