దెయ్యం వదిలిస్తానంటూ.. రూ. 73 లక్షలు స్వాహా

2 Apr, 2021 18:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కువైట్‌: మనిషి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా.. మూఢనమ్మకాలను మాత్రం జయించలేకపోతున్నాడు. శాస్త్రం కంటే మంత్రతంత్రాల మీదే నమ్మకం ఎక్కువ చాలా మందికి. అందుకే మన దగ్గర శాస్త్రవేత్తల కన్నా బాబాలు, స్వామీజీలకు ఆదరణ, గుర్తింపు ఎక్కువ. శాంతి చేస్తాం.. దెయ్యాలను వదిలిస్తామంటూ జనాల దగ్గర డబ్బులు గుంజే వారికి కొదవే లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దెయ్యం వదిలిస్తామంటూ ఏకంగా 73 లక్షల రూపాయలు స్వాహా చేశాడో వ్యక్తి. ఈ ఘటన కువైట్‌లో చోటు చేసుకుంది. 

స్థానిక మీడియా కైరో రిపోర్ట్స్‌ ప్రకారం ఓ మహిళ తన ఒంట్లో దెయ్యం ప్రవేశించిందని.. అది తనను కంట్రోల్‌ చేస్తుందని దాని వల్ల ఏం చేస్తున్నానో తనకే తెలియకుండా పోతుందంటూ స్నేహితురాళ్ల దగ్గర చెప్పుకుని బాధపడింది. దాంతో ఆమె స్నేహితులు తమకు ఓ తాంత్రికుడు తెలుసని.. దెయ్యాలు వదిలించడంలో అతడు ఎక్స్‌పర్ట్‌ అని చెప్పి.. సదరు మహిళను అతడి దగ్గరకు తీసుకెళ్తారు. తాంత్రికుడు దెయ్యం వదిలిస్తానని దానికి బాగా ఖర్చవుతుందని వారికి తెలుపుతాడు. ఈ క్రమంలో మహిళ తొలత 4 వేల దినార్లు అతడి బ్యాంక్‌ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది. దాంతో అతడు దెయ్యం వదిలించే కార్యక్రమం ప్రారంభిస్తాడు. ఏవోవే పూజలు చేసి.. దెయ్యాన్ని పారదోలానని చెప్పాడు. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి మరో 26 వేల దినార్లు తీసుకున్నాడు. ఇలా మొత్తం 30 వేల దినార్లు(73 లక్షల రూపాయలు) స్వాహా చేశాడు.

ఆ తర్వాత కూడా మహిళకు తన ఆరోగ్యంలో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహిస్తుంది. వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితురాళ్లు,  సదరు మాంత్రికుడి మీద ఫిర్యాదు చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు బాధితురాలి స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

చదవండి: ఆ దెయ్యం బొమ్మ తిరిగి వ‌చ్చేసిందా?

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు