‘మగాళ్లకు, మీకు తేడా ఏంటి.. పెళ్లి ఎలా అవుతుంది’

24 Aug, 2021 15:02 IST|Sakshi

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టాంజానియా అధ్యక్షురాలు

డోడోమా: ఆఫ్రికన్‌ దేశం టాంజానియా అధ్యక్షురాలు ఫుట్‌బాల్‌ క్రీడాకారిణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ‘‘ఫుట్‌బాల్‌ క్రీడాకారిణులు ట్రోఫీలు గెలవడం సంతోషమే కానీ.. వారి వైవాహిక జీవితాలను పరిశీలిస్తే.. అంత సవ్యంగా ఉండవు. ఛాతీ చిన్నగా ఉండటంతో.. వారు పురుషులను ఆకర్షించలేరు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజనులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. 

ప్రెసిడెంట్ సామియా సులుహు హసన్ గత ఆదివారం జరిగిన ఒక వేడుకలో మాట్లాడుతూ...  ‘‘మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు చిన్నదైన వక్షస్థలం కలిగి ఉండటం వల్ల ఆకర్షణను కోల్పోతున్నారు. కనుక వారిని వివాహం చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషుల జాతీయ ఫుట్‌బాల్ జట్టు ప్రాంతీయ టోర్నమెంట్ గెలిచిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హసన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. (చదవండి: విధి వెక్కిరిస్తే.. పోర్న్‌స్టార్‌ అయ్యాడు)

‘‘ఈ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణులు ఓ విషయం ఆలోచించాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేది పురుషులు.. స్త్రీలు కాదు. మీరు వారి ముఖాలను చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు వివాహం చేసుకోవాలని భావిస్తే.. అందంగా ఉన్న వ్యక్తినే కోరుకుంటారు. అలానే పురుషుడు కూడా తాను వివాహం చేసుకోవాలని భావించే అమ్మాయి అంతే అందంగా ఉండాని కోరుకుంటాడు. కానీ మహిళా ఫుట్‌బాల్‌ క్రీడాకారుల్లో ఆ లక్షణాలు అదృశ్యమవుతున్నాయి’’ అన్నారు. (చదవండి: ఏం యాక్టింగ్‌రా బాబు; నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు)

‘‘ఈ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు ట్రోఫీలు తెచ్చి దేశం గర్వపడేలా చేస్తున్నారని, కానీ..  భవిష్యత్తులో వారి జీవితాలను చూస్తే అంత సవ్యంగా ఉండవు. ఆడటం వల్ల అలసిపోయిన శరీరంతో వారు ఎలాంటి జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ మీలో ఎవరైనా ఫుట్‌బాల్‌ క్రీడాకారిణీని మీ భార్యగా ఇంటికి తీసుకెళ్తే..  మీ అమ్మ.. ఆమెను చూసి.. మీరు వివాహం చేసుకుంది స్త్రీనా.. లేక పురుషుడినా అని ప్రశ్నిస్తుంది’’ అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు.

ఈ వ్యాఖ్యల వల్ల హసన్‌ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ మహిళవు అయ్యి ఉండి ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియో ఆఫ్రికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

మరిన్ని వార్తలు