అత్యంత ప్రత్యేకం.. ప్రళయమొచ్చినా.. లైట్‌ తీసుకుంటాయ్‌!

24 Apr, 2022 03:32 IST|Sakshi

జీవులేవైనా నీరు, ఆహారం వంటివి లేకుండా కొద్దిరోజులు కూడా బతకలేవు. గాలి లేకుంటే కొద్ది నిమిషాలైనా ప్రాణంతో ఉండలేవు. కానీ కంటికి సరిగా కనిపించని ఓ రకం జీవులు మాత్రం.. నీళ్లు, ఆహారం లేకున్నా ఏళ్లకేళ్లు బతికేస్తాయి. అవే టార్డిగ్రేడ్‌లు. చూడటానికి ఎలుగుబంట్లలా ఉంటాయి కాబట్టి ‘వాటర్‌ బేర్‌’ అని కూడా పిలుస్తుంటారు. మరి ఏమిటీ జీవులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా?
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

అటు తాబేళ్లు.. ఇటు ఎలుగుబంట్లు 
భూమ్మీది జీవులన్నింటిలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని బతకగలిగేవి ‘వాటర్‌ బేర్‌’లు. నీటిలో ఉండే వీటిని 1777లో జర్మన్‌ శాస్త్రవేత్త జోహాన్‌ ఎఫ్రేమ్‌ గోజ్‌ గుర్తించారు. తాబేళ్ల (టార్టాయిస్‌)లా నిదానంగా కదులుతాయి కాబట్టి ‘టార్డిగ్రేడ్స్‌’ అని పేరుపెట్టారు. ఇక శరీరం ఎలుగుబంటిని పోలి ఉండటంతో ‘వాటర్‌ బేర్స్‌’ అని పిలుస్తారు. వీటికి జంతువుల్లా ఎటంటే అటు కదలగలిగే తల, దానిపై గుండ్రని నోరు, ఎనిమిది కాళ్లు ఉంటాయి. సైజు సగటున ఒక మిల్లీమీటర్‌ మాత్రమే. కానీ 40వేలకుపైగా కణాలు ఉంటాయట. భూమిపై సుమారు 1,300 జాతుల వాటర్‌ బేర్‌లు ఉన్నాయని అంచనా. 

నీళ్లు లేకుండా 30 ఏళ్లు.. 
సాధారణంగా నీళ్లు లేకుండా.. మనుషులు మూడు రోజుల పాటు మాత్రమే బతకగలరు. ఒంటెలు 15 రోజుల దాకా జీవిస్తాయి. కానీ ‘వాటర్‌ బేర్‌’లు ఏకంగా 30 ఏళ్లపాటు నీళ్లు లేకుండా బతుకుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
♦నీళ్లు లేకపోవడం, అత్యంత వేడి పరిస్థితుల్లో టార్డిగ్రేడ్‌లు ‘యాన్‌హైడ్రోబయోసిస్‌’ స్థితిలోకి మారిపోతాయి. అంటే వాటి శరీరాన్ని గుండ్రంగా చుట్టేసుకుని ఒక బంతి రూపంలోకి వస్తాయి. పైన గట్టి కవచం ఏర్పడుతుంది. ఇదే సమయంలో లోపల కణాల్లోని నీటి స్థానంలో గాజు వంటి ఒక ప్రత్యేకమైన ప్రొటీన్‌ (గ్లాన్‌ మ్యాట్రిక్స్‌) చేరుతుంది. కణాల్లోని భాగాలు, డీఎన్‌ఏ, ఇతర ప్రొటీన్లు, మెంబ్రేన్‌ వంటివేవీ ఏమాత్రం దెబ్బతినకుండా గ్లాస్‌ మ్యాట్రిక్స్‌ చూసుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియను ‘టన్‌ స్టేట్‌’గా పిలుస్తారు. పరిస్థితి అనుకూలంగా మారగానే.. టార్డిగ్రేడ్‌లు తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాయి. 

ఆ కేటగిరీయే.. సెపరేటు! 
భూమ్మీది జీవజాలంలో అత్యంత ప్రత్యేకమైన ‘ఎక్స్‌ట్రీమోఫైల్స్‌’ కేటగిరీలో టార్డిగ్రేడ్స్‌ను చేర్చారు. అంటే.. ఎప్పటికీ మంచుతో నిండి ఉండే శీతల పరిస్థితులు, అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన రేడియేషన్, అధిక పీడనం, అంతరిక్షంలోని శూన్యం.. వంటి అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని జీవించగలవని అర్థం. 

బుల్లెట్‌నూ తట్టుకుంటాయి 
టార్డిగ్రేడ్‌లను గన్‌తో కాల్చినా బతకగలవని కెంట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు టార్డిగ్రేడ్‌లను అతి చల్లదనానికి గురిచేసి, అవి ‘టన్‌’ పరిస్థితికి చేరాక.. బుల్లెట్ల ముందుభాగాన అంటించి వేర్వేరు దూరాల్లోని లక్ష్యాలను కాల్చారు. అందులో కొన్ని బుల్లెట్లపై టార్డిగ్రేడ్లు బతికి ఉండటంతో.. ఎంత ఒత్తిడిని తట్టుకోగలిగాయన్నది తేల్చారు. గంటకు 3వేల కిలోమీటర్ల వేగంతో దూ సుకొచ్చేవాటిని టార్డిగ్రేడ్‌లు తట్టుకోగలిగినట్టు గుర్తించారు. 

ప్రళయం వచ్చినా.. 
♦టార్డిగ్రేడ్లు భూమ్మీద సుమారు 60 కోట్ల ఏళ్ల కిందటి నుంచే ఉన్నట్టు శాస్త్రవేత్తల అంచనా. అంటే అప్పటికి డైనోసార్లు కూడా పుట్టలేదు. 
♦టార్డిగ్రేడ్‌లు 150 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలనూ తట్టుకోగలవు. 100 సెంటీగ్రేడ్‌ల వేడికే నీళ్లు మరుగుతాయి. అంటే మరిగే నీటిలోనూ ఇవి బతికగలవు. 
♦మనం కాస్త చలికే వణికిపోతాం. అదే టార్డిగ్రేడ్‌లు మైనస్‌ 200 డిగ్రీల శీతల పరిస్థితినీ తట్టుకుని.. 30 ఏళ్లకుపైగా జీవంతో ఉండగలవు. 
♦ఆక్సిజన్‌ లేకుండా ‘టన్‌ స్టేట్‌’లో ఏళ్లపాటు బతక గలవు. అంతరిక్షంలో శూన్యాన్ని, తీవ్రస్థాయి రేడియేషన్‌ను తట్టుకోగలవు.అందుకే వీటిని ఇటీ వలే అంతరిక్షంలోకి పంపి ప్రయోగం చేశారు. 
♦ఇంత ‘గట్టి’ జీవి కావడంతోనే.. ఒకవేళ భూమిపై ప్రళయం వచ్చినా అవి బతికేయగలవని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. 

ఓ వీక్‌నెస్సూ ఉంది! 
చిత్రమేమిటంటే ఎన్నో కఠిన పరిస్థితులను తట్టుకునే టార్డిగ్రేడ్‌లు.. నత్తలు విడుదల చేసే జిగురువంటి పదార్థం (స్లైమ్‌)లో మాత్రం బతకలేవట. ఇటీవల దీనిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. స్లైమ్‌లో ముంచిన టార్డిగ్రేడ్‌లలో 34 శాతమే బతికినట్టు గుర్తించారు. 

మరిన్ని వార్తలు