వైరస్‌ పుట్టిందెక్కడ?.. నిగ్గుతేల్చడానికి చైనాకు

12 Jan, 2021 09:50 IST|Sakshi

14న చైనాలో డబ్ల్యూహెచ్‌ఓ బృందం దర్యాప్తు 

బీజింగ్‌ : ప్రాణాంతక కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందని ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వైరస్‌ను సృష్టించి, ప్రపంచంపైకి వదిలిందన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ వైరస్‌ ఎక్కడ పురుడు పోసుకుందన్న విషయాన్ని నిగ్గుతేల్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సన్నద్ధమైంది. 10 మంది నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఈ నెల 14వ తేదీన చైనాకు చేరుకోనుంది. ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ సోమవారం స్వయంగా వెల్లడించారు. కరోనా వైరస్‌ పుట్టుక, వ్యాప్తి మార్గాన్ని కనిపెట్టే విషయంలో సైంటిస్టులకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. దీంతో చాలారోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది.

తమ దేశంలోకి డబ్ల్యూహెచ్‌ఓ బృందాన్ని అనుమతించకుండా చైనా మొండికేసిన సంగతి తెలిసిందే. నిపుణుల బృందం 14న చైనాలో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. వైరస్‌కు మూలమని చాలామంది భావిస్తున్న వూహాన్‌ మార్కెట్‌ను సందర్శించనుంది. అయితే, వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (డబ్ల్యూఐవీ)లో కరోనా వైరస్‌ను సృష్టించారని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీని సందర్శిస్తుందా? లేదా? అనేదానిపై ఇంక స్పష్టత రాలేదు. ఒకవేళ సందర్శిస్తే వైరస్‌కు సంబంధించిన కీలక వివరాలు బయట పడే అవకాముందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

భారత్‌లో16 వేల కొత్త కేసులు 
న్యూఢిల్లీ: దేశంలో సోమవారం 24 గంటల్లో 16,311 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,66,595కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 161 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,51,160కు చేరుకుందని తెలిపింది. దాదాపు 229 రోజుల తర్వాత మరణాల సంఖ్య 170కి దిగువగా నమోదు కావడం గమనార్హం. యూకే స్ట్రెయిన్‌ కరోనా సోకిన వారి సంఖ్య తాజాగా 96కు చేరుకుంది. శనివారం వరకూ వారి సంఖ్య 90గా ఉన్న సంగతి తెలిసిందే. వీరందరిని ఇతర రోగుల నుంచి విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,00,92,909కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.43 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,22,526గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.44 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.44గా ఉంది. ఈ నెల 10 వరకూ 18,17,55,831 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఆదివారం 6,59,209 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.

చదవండి:
కరోనా పేరిట సంక్షోభం.. ఎమర్జెన్సీ విధింపు

మరిన్ని వార్తలు