‘చికెన్‌’ మిరాకిల్‌.. కోమా నుంచి కోలుకున్నాడు

9 Nov, 2020 10:54 IST|Sakshi

తైపీ: ‘ఫేవరెట్‌ ఫుడ్’‌ పిల్లల ఏడుపుని.. ఆకలిని, అలకని తగ్గిస్తుందని తెలుసు. కానీ ఏకంగా మెడిసిన్‌గా పని చేసి కోమా నుంచి కోలుకునేలా చేస్తుందని ఎప్పుడైనా విన్నారా.. లేదు కదా. కానీ ఇలాంటి సంఘటన ఒకటి తైవాన్‌లో చోటు చేసుకుంది. దాదాపు రెండు నెలలకు పైగా కోమాలో ఉన్న వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారం పేరు చెప్పగానే కోలుకున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. వివరాలు.. తైవాన్‌కు చెందిన చియు అనే యువకుడు రెండు నెలల క్రితం స్కూటర్‌ మీద నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లీహం, కుడి మూత్ర పిండం, లివర్‌ దారుణంగా దెబ్బ తిన్నాయి. అంతర్గత గాయాల కారణంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆస్పత్రిలో చేర్చిన చియుకు ఆరు ఆపరేషన్‌లు జరిగాయి. ప్రాణాపాయం తప్పింది కానీ అతడు కోమాలోకి వెళ్లాడు. ఇక చియు ఎప్పుడు కోలుకునేది తాము చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. (చదవండి: కోమా నుంచి బయటకు.. పదేళ్ల తర్వాత శిక్ష)

ఈ క్రమంలో చియు కుటుంబ సభ్యులు అతడు కోలుకోవాలని.. దేవుడిని ప్రార్థించారు. ఏదైనా అద్భుతం జరిగి.. చియు కోలుకుంటాడేమోనని బెడ్‌ పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకునేవారు. ఇలా 62 రోజులు గడిచిపోయింది. ఈ క్రమంలో చియు సోదరుడు అతడిని చూడటానికి ఆస్పత్రికి వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా.. చియు నేను నీ ఫేవరెట్‌ చికెన్‌ ఫిల్లెట్స్‌ తినబోతున్నాను అని తెలిపాడు. ఆశ్చర్యం.. రెండు నెలలకు పైగా కోమాలో ఉన్న చియుకి చికెన్‌ ఫిల్లెట్స్‌ పేరు వినగానే స్పృహ వచ్చింది. పల్స్‌ రేటు పేరిగింది. విషయం తెలుసుకున్న వైద్యులు చియు పరీక్షించి అతడు కోలకున్నాడని తెలిపారు. నిజంగా ఇది అద్భుతం అన్నారు. ఆ తర్వాత చియు పూర్తిగా కోలుకున్నాక అతడిని డిశ్చార్జ్‌ చేశారు. తాజాగా అతడు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ కేక్‌ తీసుకెళ్లి ఇచ్చాడు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు