Miss Universe Singapore-2021: మిస్‌ సింగపూర్‌గా శ్రీకాకుళం యువతి

20 Sep, 2021 11:01 IST|Sakshi

మిస్‌ సింగపూర్‌ యూనివర్స్‌ 2021గా నిలిచిన బాన్న నందిత

కౌలలాంపూర్‌: విదేశాల్లో జరిగే అందాల పోటీల్లో మన భారతీయులు ప్రతిభ చాటిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఓ తెలుగుమ్మాయి వచ్చి చేరింది. సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. ఆ వివరాలు.. 

నందిని స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లా. దాదాపు 25 సంవత్సరాల క్రితం నందిత తల్లిదండ్రులు మాధురి, గోవర్ధన్‌లు సింగపూర్‌ వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. వీరికి నందితతో పాటు మరో కుమారుడు ఉన్నారు. నందితకు ఫ్యాషన్‌ ప్రపంచం అంటే చిన్ననాటి నుంచి అమితమైన ఆసక్తి. దానిలో భాగంగానే పార్ట్‌ టైమ్‌ మోడల్‌గా పని చేసేది నందిత. 

ఆ ఆసక్తితోనే నందిత ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021లో పోటీలో పాల్గొంది. అందం, తెలివితేటలతో ప్రథమ స్థానంలో నిలిచి అందాల కిరీటం దక్కించుకుంది. టైటిట్‌ గెలిచిన అనంతరం నందిత జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఆమె సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.
(చదవండి: షాకింగ్‌: అందాల పోటీ విజేతకు వేదిక మీదే ఘోర అవమానం)

ప్రస్తుతం నందిత సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (బిజినెస్ అనలిటిక్స్) కోర్సును అభ్యసిస్తోంది. కోడింగ్ వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఆమె హాబీలలో స్కేటింగ్, వంట, డ్యాన్స్‌ ఉన్నాయి. నందిత సింగపూర్‌లోని కేర్ కార్నర్‌లో వాలంటీర్‌గా పని చేస్తూ.. అక్కడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మార్గదర్శకత్వం చూపడమే కాక జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది.
(చదవండి: అశ్లీల నృత్యం.. అందాల కిరీటం వెనక్కి)

గత సంవత్సరం, నందిత సింగపూర్ హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్‌ను ప్రమోట్ చేసే టీవీ యాడ్‌లో కనిపించింది. ఈ సంవత్సరం మార్చిలో, ఆమె సింగపూర్‌లోని ఆర్ట్-సైన్స్ మ్యూజియంలో లూయిస్ విట్టన్ ఉమెన్స్ స్ప్రింగ్ సమ్మర్ 2021 లో మోడల్‌గా చేసింది. అలానే డిసెంబర్ 2020-జనవరి 2021 వోగ్ సింగపూర్ సంచికలో కూడా కనిపించింది. 

చదవండి: Miss Universe: ఏంటీ ఆండ్రియాకు పెళ్లైందా?!

మరిన్ని వార్తలు