Young Wonder: తెలుగు కుర్రాడికి ప్రతిష్టాత్మక సీఎన్‌ఎన్‌ హీరోస్ అవార్డు..

17 Dec, 2022 17:34 IST|Sakshi

వాషింగ్టన్‌: తెలుగు కుర్రాడు అమెరికాలో సత్తా చాటాడు. వాడి పడేసిన బ్యాటరీలు రీసైకిల్ చేస్తున్నందుకు సీఎన్‌ఎన్‌ హీరోస్ యంగ్ వండర్ అవార్డు కైసవం చేసుకున్నాడు. 13 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించాడు. ఈ కుర్రాడి పేరు శ్రీ నిహాల్‌ తమ్మన. తెలుగు మూలాలున్న ఇతని కుటుంబం అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నివసిస్తోంది.

వాడి పడేసిన బ్యాటరీలు పర్యావరణానికి హానికరం. అందులోని కెమికల్స్ మట్టిని, నీటిని కలుషితం చేస్తాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల బ్యాటరీలను పడేస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో 10 ఏళ్ల పసిప్రాయంలోనే గుర్తించాడు నిహాల్. 2019లోనే 'రీసైకిల్ మై బ్యాటరీ  క్యాంపెయిన్' ప్రారంభించాడు. 

బ్యాటరీ రీసైకిల్‌పై అమెరికాలోని స్కూళ్లు తిరిగి విద్యార్థులకు అవగాహన కల్పించాడు నిహాల్. తనతో కలిసి స్వచ్ఛందంగా పనిచేసేందుకు 300 సభ్యుల టీంను ఏర్పాటు చేసుకున్నాడు. వాడిపడేసే బ్యాటరీల కోసం స్కూళ్లు, ఇతర ప్రదేశాల్లో ప్రత్యేక బిన్‌లు ఏర్పాటు చేశాడు. ఇలా మూడేళ్లలో మొత్తం 2,25,000 బ్యాటరీలను సేకరించి వాటిని రీసైకిల్ చేశాడు.

నిహాల్ ప్రతిభను గుర్తించిన సీఎన్‌ఎన్‌ అతడ్ని యంగ్ వండర్‌ అవార్డుతో గౌరవించింది. భవిష్యత్తుల్లో ప్రపంచమంతా రీసైక్లింగ్ బ్యాటరీ సేవలను విస్తరించి పర్యావరణాన్ని కాపాడటమే తన లక్ష‍్యమని నిహాల్ చెబుతున్నాడు.


చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనాలో తొలిసారి మరణాలు!

మరిన్ని వార్తలు