టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021: అపర మేధావికి పట్టం

14 Dec, 2021 06:03 IST|Sakshi

Time's person of the year 2021: టైమ్‌ మ్యాగజైన్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2021’గా టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమాన్‌గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్సేస్‌ ఎక్స్‌కు కూడా మస్క్‌ సీఈవోగా ఉన్నారు.


ఈ ఏడాదిలోనే అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను అధిగమించి ఎలన్‌ మస్క్‌ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. మధ్యలో ఇద్దరి మధ్య దోబుచులాట నడిచినప్పటికీ.. చివరికి తన సంపదను అమాంతం పెంచేసుకుని అపర కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు యాభై ఏళ్ల మస్క్‌. ప్రస్తుతం సంపద దాదాపు 253 బిలియన్‌ డాలర్లు ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మస్క్‌కు 17 శాతం షేర్లున్నాయి(చాలా వరకు అమ్మేసుకుంటూ పోతున్నాడు).

1927 నుంచి ప్ర‌తి క్యాలెండ‌ర్ ఇయ‌ర్ ముగింపులో ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ వార్తా క‌థ‌నాన్ని టైమ్‌ మ్యాగ‌జైన్ ప్ర‌చురిస్తున్న‌ది. ఆ వ్య‌క్తి ఫొటోను క‌వ‌ర్‌పేజీపై ముద్రిస్తుంది. ఏడాది కాలంలో వివిధ అంశాల్లో ఆయా వ్య‌క్తుల ఇన్‌ఫ్ల్యూయెన్స్ ఆధారంగా ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌`ను ఎంపిక చేస్తుంది. సోషల్‌ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో మార్కెట్‌ను ఒకే ఒక్క ట్వీట్‌తో శాసిస్తూ వస్తున్నాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఇక ట్విట్టర్‌లో ఎలన్‌ మస్క్‌ 6.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

 

టెస్లా సీఈవోగానే కాకుండా సొంత రాకెట్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కూ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు యాభై ఏళ్ల ఎలన్‌ మస్క్‌. టెస్లా నుంచి పైసా కూడా జీతంగా తీసుకోకుండా.. తన వాటా ద్వారా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇక స్పేస్‌ఎక్స్‌ ఒప్పందాలు-షేర్లతోనూ బిలియన్లు సంపాదిస్తున్నాడు.  వీటితో పాటు ది బోరింగ్‌ కంపెనీ అనే మౌలిక వసతుల కంపెనీ, బ్రెయిన్‌ చిప్‌ స్టార్టప్‌ ‘న్యూరాలింక్‌’లకు వ్యవస్థాపకుడి హోదాలో పని చేస్తున్నాడు. 

చదవండి: ఎలన్‌ మస్క్‌ వెటకారం! ప్రధాని పైనా సెటైర్లు

మరిన్ని వార్తలు