కెమికల్‌ కాస్ట్రేషన్‌ బిల్లుకు ఆమోదం..ఏ దేశాల్లో అమల్లో ఉందంటే..!

12 Jul, 2022 21:25 IST|Sakshi

బ్యాంకాక్‌: ప్రపంచవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. భారత్‌లో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ లాభం లేకుండా పోతోంది. అలాంటి వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపిస్టులపై కొరడా ఝులిపించింది థాయ్‌లాండ్‌. అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినమైన కెమికల్‌ కాస్ట్రేషన్‌కు గురి చేసే చట్టానికి ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. 

కొత్త చట్టం ప్రకారం.. సైకియాట్రిక్‌, అంతర్గత మెడిసన్‌ స్పెషలిస్ట్‌ల ఆమోదంతో పాటు నేరస్థుడి అనుమతితో కెమికల్‌ కాస్ట్రేషన్‌ చేపట్టాలి. లైంగిక సామర్థ్యాన్ని తగ్గించేలా శరీరంలో టెస్టోస్టిరాన్‌ స్థాయులను తగ్గించే ఇంజెక్షన్లు, చికిత్సకు అంగీకరించిన వారి జైలు శిక్ష తగ్గించనున్నారని బ్యాంకాక్‌ పోస్ట్‌ తెలిపింది. 'హింస సంబంధిత పునర్విచారణ నిరోధక బిల్లు'ను న్యాయశాఖ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును దిగువ సభ గత ఫిబ్రవరిలోనే ఆమోదించగా.. తాజాగా ఎగువసభ సెనేట్‌ ఆమోద ముద్ర వేసింది. 147 సభ్యులతో కూడిన సభలో బిల్లుకు ఇద్దరు గైర్హాజరు కాగా 145-0 తేడాతే ఏకగ్రీవంగా ఆమోదం లభించటం గమనార్హం. స్వచ్ఛంద కెమికల్‌ కాస్ట్రేషన్‌ బిల్లుకు ఆమోదం లభించిన క్రమంలో.. చేపట్టాల్సిన ప్రక్రియను అధికారులు సిద్ధం చేయనున్నారు. ఈ బిల్లు రాయల్‌ గెజిట్‌లో పబ్లీష్‌ అయ్యాక చట్టంగా మారనుంది. 

ఏ దేశాలు ఈ శిక్షను అమలు చేస్తున్నాయి?
కెమికల్‌ కాస్ట్రేషన్‌ అనేది శిక్షల్లో కొత్తదేమి కాదు. ఇది దక్షిణ కొరియా, పాకిస్థాన్‌, పోలాండ్‌, అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల‍్లో దీనిని అమలు చేస్తున్నారు. మరోవైపు.. నార్వే, డెన్మార్క్‌, జర్మనీ వంటి దేశాల్లో సర్జికల్‌ కాస్ట్రేషన్‌ను పాటిస్తున్నారు. అయితే.. ఈ విధమైన శిక్షలు మానవ హక్కులను హరిస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 

కాస్ట్రేషన్‌ చేయటం వల్ల నేరస్థుడు తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. దీనికి గురైన వ్యక్తి క్రూరంగా ప్రవర్తించటం, వివాహద్వేషిగా మారతాడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, బాలికలను ద్వేషించటం, వారికి హాని కలిగించటం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. సెక్స్‌ అనేది ఒక్కటే దాడికి మార్గం కాదని, ఇతర దారుల్లో మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందన‍్నారు. మరోవైపు.. అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి కఠిన శిక్షలు అవసరమని మరోవర్గం వాదిస్తోంది. కాస్ట్రేషన్‌ భయంతో నేరాలకు పాల్పడేందుకు వెనకడుగువేస్తారని బావిస్తున్నారు. 

ఇదీ చూడండి: యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల పనేనా?

మరిన్ని వార్తలు