వెరైటీ దొంగలు.. డబ్బు, బంగారం వద్దు.. అవే కావాలి..పట్టుకుంటే 10 వేల డాలర్లు!

25 Feb, 2022 04:54 IST|Sakshi

సాధారణంగా దొంగలంటే డబ్బో లేక బంగారమో దోచుకుంటుంటారు. దాదాపుగా ఎక్కడైనా జేబులు కొట్టే వాళ్లు మొదలు.. ఇళ్లను కొల్లగొట్టే వాళ్ల వరకు రకరకాల చోరశిఖామణులు ఉంటారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మాత్రం వెరైటీ దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. రాత్రికిరాత్రే ‘సొత్తు’ను కొల్లగొడుతూ స్థానికులకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇంతకీ వాళ్లు చేసే ‘కటింగ్‌’ ఏమిటో తెలుసా? తేనెటీగల చోరీ..!! వెంటాడి మరీ కుట్టికుట్టి పెట్టే తేనెటీగలను దొంగలు అమాంతం ఎత్తుకుపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..! అందుకే మరి దీన్ని వెరైటీ చోరీ అంటున్నది. 

ఇంతకీ విషయం ఏమిటంటే.. 
కాలిఫోర్నియా రకం బాదంపప్పు గురించి మీకు తెలుసుగా.. వాణిజ్య స్థాయిలో యావత్‌ అమెరికాకు అవసరమయ్యే 100 శాతం బాదంపప్పును ఈ రాష్ట్రమే సరఫరా చేస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే బాదంలో 80 శాతం కాలిఫోర్నియా రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇంత భారీ స్థాయిలో బాదం సాగు జరగాలంటే అందుకు పరపరాగ సంపర్కం అవసరం.

ఈ విషయంలో తేనెటీగలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఎందుకంటే బాదం తోటల్లో తేనెటీగలు వేర్వేరు చెట్లపై వాలుతూ పుప్పొడిని తరలించే వాహకాలుగా మారి వాటి ఫలదీకరణకు దోహదపడుతుంటాయి. ఇందుకోసం ఏటా కాలిఫోర్నియాలోని బాదం రైతులు తేనెటీగల పెంపకందారుల నుంచి వాటిని అద్దెకు తెచ్చుకుంటుంటారు.

తేనెటీగలతో కూడిన ఒక్కో కృత్రిమ తేనెతుట్టె అద్దె 210 డాలర్లు (సుమారు రూ. 15,800)గా ఉంటుంది. దీన్ని పసిగట్టిన చోరులు... ఈ సీజన్‌లో పెంపకందారులు కృత్రిమ తేనెతుట్టెల్లో సిద్ధంగా ఉంచే వేలాది డాలర్ల విలువైన తేనెటీగలను ఎత్తుకుపోతున్నారట! వాటిని అధిక ధరలకు బాదం రైతులకు అమ్ముకుంటూ లక్షాధికారులైపోతున్నారట!! 

పట్టుకుంటే 10 వేల డాలర్లు.. 
గత నెలలో ఇలాగే కొందరు దొంగలు ఓ ఫారంలోని లక్షలాది తేనెటీగలను రాత్రికిరాత్రే మాయం చేయడంతో అప్రమత్తమైన కాలిఫోర్నియా రాష్ట్ర తేనెటీగల పెంపకందారుల సంఘం దొంగలను పట్టిచ్చే వారికి ఏకంగా 10 వేల డాలర్ల (సుమారు రూ. 7,50,000) నజరానా ప్రకటించింది!! అయినా వాటిలో కొన్ని తుట్టెలే చివరకు దొరికాయట. కొందరు పెంపకందారులైతే ఒక అడుగు ముందుకేసి తమ కృత్రిమ తేనెతుట్టెలు చోరీకి గురైతే సులువుగా గుర్తించేందుకు వాటికి ముందుగానే జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాలను అమరుస్తున్నారట! 

కారణం ఏమిటి? 
అమెరికన్లు తినే మూడో వంతు ‘ఆహారం’తయారీ తేనెటీగలు, సీతాకోకచిలుకలు, గబ్బిలాల వంటి వాటిపైనే ఆధారపడి ఉందని అమెరికా వ్యవసాయశాఖ చెబుతోంది. అయితే గత 50 ఏళ్లుగా అమెరికాలో తేనెటీగల సంఖ్య భారీగా తగ్గిపోతోందని పేర్కొంటోంది. ఒక్క 2006లోనే దేశంలోని ఏకంగా 30 శాతం తేనెటీగలు నశించాయని తెలిపింది. పంట రసాయనాల వాడకం అధికం కావడం, వ్యాధులు, పౌష్టికాహారలేమి ఇందుకు ప్రధాన కారణమని వివరిస్తోంది.

మరోవైపు తేనెటీగల పెంపకం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేపట్టాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకసారి చోరీకి తేనెటీగలు చోరీకి గురైతే మళ్లీ నాణ్యమైన, కొత్త వాటిని పెంచేందుకు ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. అందుకే చోరుల కన్ను వీటిపై పడిందని అంటున్నారు.  
–సాక్షి, సెంట్రల్‌డెస్క్‌ 

మరిన్ని వార్తలు