వైర‌ల్‌: వేలాది మంది చైనీయుల పార్టీ

18 Aug, 2020 13:40 IST|Sakshi

వూహాన్‌: ఫేస్ మాస్కు ధ‌రించైనా స‌రే, బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల్సిన ప‌రిస్థితి దాపురించింది. అలాంటిది పార్టీ అంటే.. ఎందుకొచ్చిన గొడ‌వ‌! మ‌ళ్లీ ఎక్క‌డ ఆ వైర‌స్ అంటుతుందోన‌ని జ‌నాలు ర‌ద్దీగా ఉండే ఏ కార్య‌క్ర‌మానికైనా స‌రే వెళ్లేది లేద‌ని తేల్చి చెప్తున్నారు. మ‌న ద‌గ్గ‌రే ఇలా ఉంటే క‌రోనాను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన చైనాలోని వూహాన్‌లో ఇంకెన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? కానీ అక్క‌డ అలాంటి భ‌యాలేవీ క‌నిపించ‌డం లేదు. అందుకు పైన క‌నిపిస్తున్న ఫొటోనే నిద‌ర్శ‌నం. వూహాన్‌లోని మాయా బీచ్ పార్క్‌లో ఆదివారం విద్యుత్ వెలుగుల మ్యూజిక్ పార్టీ జ‌రిగింది. అనేక‌మంది నీళ్ల‌లో ఆట‌లాడుతూ, భౌతిక దూరాన్ని బుగ్గి చేస్తూ, ఫేస్ మాస్క్ ఊసే మ‌రుస్తూ జ‌ల‌కాలాడారు. ఒక‌రినొక‌రు ఆనుకుంటూ గుంపులు గుంపులుగా ఎంజాయ్ చేశారు. క‌రోనాను లైట్ తీసుకుంటూ మ‌ళ్లీ సాధార‌ణ జీవ‌నంలోకి తొంగి చూస్తున్నారు. వేలాదిమంది పాల్గొన్న ఈ పార్టీలో ఒక్క‌రు కూడా మాస్క్ ధ‌రించ‌‌క‌పోవ‌డం గ‌మనార్హం. (ఆ దెయ్యం బొమ్మ తిరిగి వ‌చ్చేసిందా?)

కాగా ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్ర‌హావేశాల‌ను ఎదుర్కొంటున్నాయి. 'క‌రోనాను ప‌రిచ‌యం చేసి, ప్ర‌పంచాన్ని నాశ‌నం చేస్తూ మీరు మాత్రం ప్ర‌శాంతంగా గ‌డుపుతున్నారు' అని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ఇదిలా వుండ‌గా గ‌తేడాది వూహాన్‌లో తొలిసారిగా క‌రోనా వైర‌స్ కేసు వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాతి నెల‌ల్లో కేసులు పెరిగిపోవ‌డంతో అక్క‌డ లాక్‌డౌన్ విధించారు. ఈ క్ర‌మంలో వాట‌ర్ పార్క్‌పై కూడా నిషేధం విధించారు. అయితే లాక్‌డౌన్ ఎత్తివేసే క్ర‌మంలో జూన్‌లో మ‌ళ్లీ ఈ పార్క్ తెరుచుకుంది. అయితే ప్ర‌జ‌లను మ‌ళ్లీ ఆకర్షితుల‌ను చేసేందుకు పార్క్ నిర్వాహ‌కులు కొత్త ప‌థ‌కం వేశారు. మ‌హిళా క‌స్ట‌మర్లు సాధార‌ణ‌ రుసుములో సగం చెల్లిస్తే స‌రిపోతుంద‌ని ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఇంకేముందీ.. జ‌నాలు.. ఈ అవ‌కాశం చేజారితే మ‌ళ్లీ దొర‌క‌ద‌న్న‌ట్టు పార్క్‌కు పెద్ద ఎత్తున క్యూ కట్టి క‌రోనా నిబంధ‌న‌ల‌కు మంగ‌ళం పాడారు. (మాస్క్‌ ధరించలేదని ఫోన్‌ లాక్కొని..)

('కోవిడ్‌'ను మనం వినక ముందే కోవిడ్‌ను చూసిన మనిషి)

మరిన్ని వార్తలు