ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎగిసిన నిరసన జ్వాల..వీధుల్లోకి వేలాదిమంది ప్రజలు

16 Apr, 2023 19:12 IST|Sakshi

ఇజ్రాయెల్‌లో మళ్లీ నిరసన జ్వాల రాజుకుంది. శనివారం వేలాదిమంది నిరసకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. మార్చి 27న ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు న్యాయవ్యవస్థలో తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు దేశాన్ని చీల్చేలా ఉన్నాయంటూ నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంస్కరణలను నిలిపి చర్చకు అనుమతించినట్లు ‍ప్రకటించిన 15వ వారంలోనే మరోసారి నిరసనలు చెలరేగాయి. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని, కాపాడుకోవాలంటూ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. దాదాపు పదివేలమందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

వారంతా మేము ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని, మాకు వేరే దేశం లేదంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేపట్టారు. ఈ సంస్కరణలు సుప్రీం కోర్టు అధికారాన్ని తగ్గించి న్యాయమూర్తుల ఎంపికపై రాజకీయ నాయకులకే ఫుల్‌గా అధికారాలుంటాయంటూ ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైఫాలోని మోడిన్‌లోని న్యాయ శాఖ మంత్రి యారివ్ లెవిన్ ఇంటి వెలుపల కూడా నిరసనలు జరిగినట్లు సమాచారం. కాగా, యూఎస్‌  రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇజ్రాయెల్ దృక్పథానికి సానుకూలం నుంచి స్థిరీకరణకు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత శనివారమే నిరసనలు వెల్లువెత్తడం గమనార్హం

ఈ కొత్త సంస్కరణల పట్ల పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఆ చట్టాన్ని అర్థాంతరంగా నిలిపి వేసి, ప్రతిపక్షాలతో చర్చలు జరిపేందుకు దారితీసింది. అయితే యూఎస్‌ మూడీస్‌ మాత్రం ప్రభుత్వం విస్తృత ఏకాభిప్రాయం కోరకుండా ఇలాంటి సంస్కరణలను అమలు చేయాలని యత్నించే తీరు సంస్థాగత బలం, విధాన అచనాల బలహీనతను సూచిస్తుందని పేర్కొంది. 

(చదవండి: కెనడాలో వైశాఖి పరేడ్‌..మూడేళ్ల అనంతరం వేడుకగా జరిగిన నగర కీర్తన!)

మరిన్ని వార్తలు