ట్రూడో టార్గెట్‌గా ఆందోళనలు

3 Feb, 2022 05:57 IST|Sakshi

టొరెంటో: కరోనా టీకా తప్పనిసరి నిబంధన, కోవిడ్‌ నిబంధనల పాటింపును వ్యతిరేకిస్తున్నవారి నిరసనలు కెనెడాలో పెరిగిపోయాయి. ఆందోళనకారులు రాజధాని నగరంలో ర్యాలీలు నిర్వహించడంతో పాటు పార్లమెంట్‌ హిల్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. కొందరు నిరసనకారులు జాతీయ మృతవీరుల స్మారకాన్ని అవమానించడం, సైనికుల సమాధిపై డ్యాన్సులు చేయడం వంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారు. కొందరు ఆందోళనకారులు స్వస్తిక్‌ గుర్తున్న ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు.

వీరికి దేశీయుల నుంచి పెద్దగా సానుభూతి లభించకున్నా వీరు మాత్రం ఆందోళనలు ఆపడం లేదు. ఇలాంటివారి సంఖ్య స్వల్పమని, అబద్ధాలను వీళ్లు ప్రచారం చేస్తున్నారని కెనెడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో దుయ్యబట్టారు. కేవలం టీకా తప్పనిసరి నిబంధనలు ఎత్తివేయడంతో తమ నిరసన ఆగదని, ట్రూడో ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. కోవిడ్‌ నిబంధనల్లో చాలా నిబంధనలను ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలు విధించినా నిరసనకారులు మాత్రం ట్రూడో ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు