యుద్ధానికి మూణ్నెల్లు

25 May, 2022 05:46 IST|Sakshi
సోల్డర్‌ సిటీలోని కర్మాగారంపై రష్యా వైమానిక దాడి

ఉక్రెయిన్‌లో రష్యా సాధించింది గోరంతే

సైనికంగా, ఆర్థికంగా రష్యాకు అపార నష్టం, అప్రతిష్ట

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి మంగళవారంతో మూడు నెలలు పూర్తయ్యాయి. రేవు పట్టణం మారియుపోల్‌ను ఆక్రమించడం మినహా ఇన్నాళ్లలో రష్యా పెద్దగా సాధించిందేమీ లేదు. సైనికంగా కనీవినీ ఎరగని నష్టాలతో ఎన్నడూ లేనంత అప్రతిష్ట మూటగట్టుకుంది. పైగా అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిగా మారింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఆర్థికంగా బాగా దెబ్బ తింది. రోజుల్లో చేజిక్కుతుందనుకున్న ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల దన్నుతో ఇప్పటికీ దీటుగా పోరాడుతూ రష్యాకు చుక్కలు చూపిస్తోంది. యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక అధ్యక్షుడు పుతిన్‌ తల పట్టుకుంటున్నారు.

రాజధాని కీవ్‌ను ఆక్రమించాలన్న వ్యూహం విఫలమవడంతో రూటు మార్చారు. కనీసం తూర్పు ఉక్రెయిన్‌లో తమ అధీనంలో ఉన్న డోన్బాస్‌ ప్రాంతాన్నయినా పూర్తిగా చేజిక్కించుని గౌరవంగా వెనుదిరిగాలని చూస్తున్నా, ఉక్రెయిన్‌ గెరిల్లా యుద్ధ తంత్రానికి రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోంది. అఫ్గానిస్థాన్‌లో పదేళ్ల యుద్ధంలో కోల్పోయినంత మంది సైనికులను ఉక్రెయిన్లో రష్యా మూడు నెలల్లోపే నష్టపోయిందని ఇంగ్లండ్‌ తాజాగా అంచనా వేసింది. యుద్ధం పట్ల రష్యన్లలోనూ వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. మెక్‌డొనాల్డ్స్‌ వంటి రెస్టారెంట్లు మొదలుకుని పెద్ద పెద్ద కంపెనీల దాకా అన్నీ రష్యావ్యాప్తంగా ఒక్కొక్కటిగా మూతబడుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలు రష్యాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టాయని పుతిన్‌ సోమవారం అంగీకరించారు.

మారియుపోల్‌లో 200 శవాలు
రష్యా ఆక్రమణలోకి వెళ్లిన మారియుపోల్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ శిథిలాల్లో కుళ్లి దుర్వాసన వస్తున్న స్థితిలో ఉన్న 200కు పైగా శవాలు తాజాగా బయటపడ్డాయి. నగరంలో నెలకొన్న అత్యంత అపరిశుభ్ర వాతావరణం పలు వ్యాధులకు దారి తీయవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లుహాన్స్‌క్‌లో ఉక్రెయిన్‌ అధీనంలో ఉన్న సెవెరో డొనెట్స్‌క్, పరిసర నగరాలపై రష్యా తీవ్ర బాంబు దాడులకు దిగింది. గత వారం డెస్నాపై జరిగిన క్షిపణి దాడిలో 87 మంది అమాయకులు బలయ్యారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

ఉక్రెయిన్‌ నెగ్గాలి: ఈయూ
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ నెగ్గి తీరాలని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాండెర్‌ లెయన్‌ అన్నారు. అందుకు యూరప్‌ అన్నివిధాలా సాయం చేస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలుపంపనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని మిత్ర దేశం ఫిలిప్పీన్స్‌ తొలిసారిగా తీవ్రంగా తప్పుబట్టింది.

యుద్ధాన్ని మొత్తం యూరోపియన్‌ యూనియన్‌పైనే దాడిగా స్పెయిన్‌ ప్రదాని పెడ్రో శాంచెజ్‌ అభివర్ణించారు. లక్షకు పైగా శరణార్థులకు స్పెయిన్‌ ఆశ్రయమిస్తోందని చెప్పారు. యుద్ధాన్ని నిరసిస్తూ జెనీవాలో ఉన్న సీనియర్‌ రష్యా దౌత్యవేత్త బోరిస్‌ బొందరెవ్‌ రాజీనామా చేశారు. ఉక్రెయిన్‌పై పుతిన్‌ తెర తీసిన యుద్ధం కారణంగా తన కెరీర్‌లో మొదటిసారి అవమానంతో తలొంచుకున్నట్టు చెప్పారు.  

మరిన్ని వార్తలు